Hyderabad Fake Call Center | మేడ్చల్: భారత్, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ ద్వారా భారీ మోసం చేస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కాల్ సెంటర్‌పై సైబర్ క్రైం, ఎస్ ఓ టీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. బాచుపల్లిలోని అద్దెకు తీసుకున్న విల్లాలో ఈ నకిలీ కాల్ సెంటర్‌ను నడుపుతున్నారు.

వేరే రాష్ట్రం నుంచి వచ్చి విల్లాలో విలాసం..

పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కొందరు యువకులు బాచుపల్లిలో ఓ విల్లా అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరు నకిలీ కాల్ సెంటర్ ప్రారంభించి తమదైన శైలిలో మోసాలకు పాల్పడుతున్నారు. నిందితులు ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థల పేర్లను ఉపయోగించి బాధితులకు ఈమెయిల్స్ పంపించేవారు. ఈమెయిల్స్ ద్వారా, వారి ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని భయపెట్టేవారు. కాల్ చేయాల్సిన నంబర్‌ను ఇచ్చేవారు. బాధితులు ఆ నంబర్లకు ఫోన్ చేస్తే, VOIP యాప్‌లు ద్వారా నకిలీ సపోర్ట్ టీమ్‌గా నటించి తమ ప్లాన్ సక్సెస్ చేసుకునేవారు. 

రిమోట్ యాక్సెస్ ద్వారా డేటా కలెక్ట్

నిందితులు AnyDesk లాంటి రిమోట్ యాక్సెస్ టూల్స్‌ను ఇన్‌స్టాల్ చేయించి ప్రజల కంప్యూటర్లను రన్ చేసేవారు. ఈ క్రమంలో నిందితులు బాధితుల బ్యాంక్ వివరాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర వ్యక్తిగత, సీక్రెట్ సమాచారం సేకరించేవారు. తమకు డేటా రాగానే బ్లాక్ మెయిల్ చేసి, బెదిరింపులకు పాల్పడి నగదు లాగేసేవారు. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేవారు.  ముఖ్యంగా వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడేవారు. మిమ్మల్ని డ్రగ్స్ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించి క్యాష్ చేసుకునేవారు. మీ అశ్లీల ఫోటోలు లీక్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేసి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. 

ఈ నకిలీ కాల్ సెంటర్ నుంచి 22 మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు, VOIP సెటప్, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వేరేచొట వారి వ్యవహారం తెలిసిపోవడం కొత్త విల్లాలో ఈ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేస్తే, వారికి చట్ట ప్రకారం సహాయం చేస్తామని పేర్కొన్నారు.