బుద్దిగా చదువుకొని మంచి మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేయాల్సిన విద్యార్థి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. మ్యాథ్స్‌ భయం ఆ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. 


శ్రీకాళం జిల్లా సంతకవిటి మండలం మోదుగలపేటకు చెందిన లావేటి సాయిప్రదీప్‌కుమార్‌ చిలకపాలెంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నాడు. చదవడం మూడో ఏడాది చదువుతున్నారు గానీ మొదటి ఏడాది బ్యాక్‌లాగ్‌ భయపెడుతూ వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పరీక్ష గటెక్కలేకపోయాడు. 


ఎలాగైనా బ్యాక్ లాగ్‌ పూర్తి చేయాలనుకున్నాడు. దీనికి చదవాల్సింది పోయింది స్నేహితుడి సాయంతో పాస్ కావాలనుకున్నాడు. అదే ప్రమాదాన్ని తీసుకొచ్చింది. తన హాల్‌టికెట్‌ను మార్చేసి స్నేహితుడితో పరీక్ష రాయించాడు. డిసెంబర్‌ 8న తన బదులు స్నేహితుడ్ని పంపించాడు సాయి. జేఎన్టీయూ కాకినాడ నుంచి వచ్చిన స్క్వాడ్‌కు చిక్కాడు సాయి స్నేహితుడు. వాళ్లిద్దరు చేసింది చీటింగ్ అని గ్రహించిన అధికారులు ఈ సంఘటనపై కమిటీ వేశారు. నెలరోజులు విచారించిన కమిటీ తల్లిదండ్రులతో  విచారణకు కాకినాడ రావాలని సాయికి నోటీసులు ఇచ్చింది.


జరిగింది ఇంటి దగ్గర చెప్పుకోలేక తప్పును ఒప్పుకోలేక చిత్రవధ అనుభవించాడు సాయి. అందుకే విచారణకు వెళ్లాల్సిన రోజునే ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాళం రోడ్డు రైల్వేస్టేషన్ పరిధి వయోడెక్ట్ సమీపంలో ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. 
రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాయి సూసైడ్ చేసుకున్న వేళ ఆ కుర్రాడు చదివే కళాశాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 


ఒక్కగానొక్క బిడ్డ మృతితో సాయి ఫ్యామిలీ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మంచి చదువులు చదివి జీవితంలో ఎంతో స్థాయికి వెళ్లాడనుకున్న కుర్రాడు ఇలా తనువు చాలించడం జీర్ణించుకోలేకపోతున్నారా తల్లిదండ్రులు. స్నేహితులు కూడా జరిగింది విని షాక్ తిన్నారు. సాయి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. 


ప్రభాకర్‌రావు, లలిత దంపతులకు సాయి ఒక్కడే కుమారుడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. మంచి చుదువులు చదివిస్తే సాయి భవిష్యత్‌ ఉన్నతంగా ఉంటుందని ఎంతో కష్టపడి చదివించారు. కానీ సాయి ఇలా చేయడంతో వాళ్లు ఒక్కసారిగా కుంగిపోయారు. అటు బంధువులు కూడా ఈ విషయం తెలుసుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. మొత్తానికి సాయి ఆత్మహత్య ఘటన ఆ మండలంలోనే చర్చకు దారి తీసింది. 



Also Read: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...