ED raid Capricornian shipping: ఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు  లాజిస్టిక్స్ కంపెనీలో సోదాలు నిర్వహించగా భారీగా నగదు పట్టుబడింది. ఈడీ అధికారులు లాజిస్టిక్స్ కంపెనీకి సంబంధించి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కురుక్షేత్ర, కోల్‌కతా ప్రాంతాల్లో  మంగళవారం దాడులు నిర్వహించగా.. ఓ చోట వాషింగ్ మెషిన్‌లో నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఏకంగా రూ.2.54 కోట్ల నగదు లభ్యం కావడంతో ఈడీ అధికారులు ఆశ్చర్యపోయారు.  లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. 47 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ రాసుకొచ్చింది.




ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం లాజిస్టిక్స్ కంపెనీపై దాడులు నిర్వహించింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో సోదాలు చేయగా రూ. 2.54 కోట్లు గుర్తించినట్లు తెలిపింది. ఫేమా (FEMA) 1999 నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. కాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, దాని అనుబంధ సంస్థలైన లక్ష్మీటన్ మారిటైమ్, హిందూస్తాన్ ఇంటర్నేషనల్, రాజ్ నందిని మెటల్స్ లిమిటెడ్, స్టేవార్ట్ అల్లాయ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ లిమిటెడ్, వినాయక్ స్టీల్స్ లిమిటెడ్, వశిష్ట కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్లు, భాగస్వాములైన సందీప్ గార్గ్, వినోద్ కేడియా, మరికొందరి నివాసాలలో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కురుక్షేత్ర, కోల్‌కతా నగరాలలో ఆకస్మిక సోదాలు చేపట్టింది ఈడీ. 






భారతదేశం నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని బదిలీ చేస్తున్నారని ఈడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో  సింగపూర్‌లోని గెలాక్సీ షిప్పింగ్ & లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్‌లోని హారిజన్ షిప్పింగ్ & లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 1,800 కోట్ల చెల్లింపులు జరిగాయని ఈడీ గుర్తించింది. ఆంథోనీ డి సిల్వా అనే వ్యక్తికి దీనితో సంబంధాలు ఉన్నాయని అభియోగాలున్నాయి. షెల్ కంపెనీలు నేహా మెటల్స్, అమిత్ స్టీల్స ట్రేడర్స్, ట్రిపుల్ ఎం మెడల్, హెచ్ఎంఎస్ మెటల్స్ తదితర కంపెనీల పేరిట నగదు లావాదేవీలు జరగడంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఓ చోట కోట్ల రూపాయల నగదు ఇంట్లో వాషింగ్ మెషిన్ లో గుర్తించినట్లు పేర్కొన్నారు.