Casino Issue: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి, సంపత్ లను ఈడీ సుధీర్ఘంగా విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు వీరిని ఈడీ అధికారులు విచారించారు. విదేశాల్లో నిర్వహించిన క్యాసినో, ఈవెంట్స్ లావాదేవీలు, పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం దారి మళ్లించడం, బ్యాంకు ఖాతాల వివరాలు, వంటి అంశాలపై ప్రవీణ్ బృందాన్ని ఈడీ అధికారులు విచారించారు. అయితే విచారణలో ప్రవీణ్ తడబడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రవీణ్ బృందాన్ని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది క్యాసినో ఏజెంట్లతో పాటు ఇంకొందరికి ఈడీ తాఖీదులు జారీ చేయనున్నట్లు సమాచారం. 


చికోటి ప్రవీణ్ ప్రైవేటు సెక్యూరిటీ  
చికోటి చీకటి సామ్రాజ్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు ఇలా చాలా మంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చికోటి ఈడీ ముందుకు వెళ్తే తమ పేర్లు బయటపడతాయన్న భయంతో కొందరు అతడి ఇంటి వద్ద పహారా పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. చికోటి ప్రవీణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పహారా కాసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంటి సమీపంలో దుండగులు తిష్ట వేశారన్నారు. దీంతో చికోటి ప్రవీణ్ ప్రైవేటు సెక్యూరిటీ అప్రమత్తం అయింది. 


అసలేం జరిగింది..?


ఇప్పుడు ఎక్కడ చూసిన చికోటి ప్రవీణ్ క్యాసినో దందా, విదేశీ హవాల గురించే వినిపిస్తోంది. చికోటి ప్రవీణ్ పేరు ప్రస్తావిస్తూ రాజకీయ నాయకులు సైతం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే వరకు వచ్చింది సంగతి. ఇటీవల చికోటి ప్రవీణ్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా చికోటి సంబంధించిన లింకులు బయటకు వస్తున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ హీరో, హీరోయిన్లతో, ఇతరు నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో చికోటి ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని వివిధ పార్టీలకు పిలవడం అందుకోసం భారీగా ఖర్చు చేయడం ప్రవీణ్ స్టైల్. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని రాజకీయ నాయకులతో ప్రవీణ్ కు చీకటి ఒప్పందాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పదవిలో ఉన్న మంత్రులతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర కార్పొరేషన్ల ఛైర్మన్లతో చికోటి ప్రవీణ్ చీకటి సామ్రాజ్యం విస్తరించాడని ఆరోపణలు వచ్చాయి.


అంతే కాకుండా నేపాల్, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్ లాండ్.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్ బృందం తరలించినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఒక్కో విడత మూడు నాలుగు రోజుల పాటు జరిగే క్యాంపుల్లో పాల్గొనేందుకు పంటర్లు  3 నుంచి 5 లక్షల చొప్పున వారికి చెల్లించినట్లు గుర్తించింది. క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మను నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడించిందనేది ఆ కేసులో ఈడీ ప్రధాన అభియోగం. అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకొని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది.