East Godavari News : ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో అసలు ఏం జరిగింది? అంతా నిద్రిస్తున్న సమయంలో ఆ ఇంటిని అగ్నికీలలు ఎలా చుట్టుముట్టాయి? గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిచి ముద్దయిన తాటాకు ఇళ్లు ఎలా కాలి బూదిదయ్యింది? గుర్తించలేనంతగా ముద్దలుగా మారిన మృతదేహాలు అంతలా ఎలా కాలిపోయాయి? మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నట్లు భర్తే కాలయమడయ్యాడా? తెల్లవారుజామున తచ్చాడిన గుర్తుతెలియని ఇద్దరు ఎవరు? దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఏం తేల్చబోతున్నారు? ఈ కేసులో అన్నీ సందేహాలే? దర్యాప్తులో చిక్కుముడులు వీడుతాయా?


అసలేం జరిగింది? 


కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం ఆకులవారి మెరకలో తల్లీకూతుళ్ల సజీవ దహనం కలకలం రేపుతోంది. వారికి కేవలం పెళ్లై అయిదు నెలలే అయింది. ప్రేమ పెళ్లి కావడంతో యువతి కుటుంబీకులు మొదట ఒప్పుకోలేదు. ఆ తరువాత అందరూ కలిసిపోయారు. అనూహ్యంగా ఇంటికి మంటలు అంటుకుని యువతి, ఆమె తల్లి ఇద్దరూ సజీవదహం అయ్యారు. అయితే ఇది ప్రమాదమా? ప్రీప్లాన్డ్ కుట్రా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇళ్లు కాలిపోయిన సంఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతురు సాధనాల మంగాదేవి, గర్భిణి అయిన ఆమె కుమార్తె మేడిశెట్టి జ్యోతి(23) సజీవ దహనం అయ్యారు. ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో బాధితుల ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయని పక్కనే ఉన్న వారి బంధువులు చెబుతున్నారు. 


గర్భిణీ సజీవదహనం 


మంటలు అంటుకున్న సమయంలో ఇంట్లో యువతి, ఆమె తల్లిదండ్రులు నిద్రపోతున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి తండ్రి తప్పించుకోగలిగారు. కానీ మంటల్లో యువతి, ఆమె తల్లి సజీవదహనం అయ్యారు. యువతి జ్యోతి అయిదు నెలల క్రితం దైవాలపాలెంకు చెందిన మేడిశెట్టి సురేష్ ను ప్రేమవివాహం చేసుకుంది. యువతి ఇప్పుడు మూడో నెల గర్భిణి. ఈ ప్రాంతంలో గ్రామ దేవత తీర్థమహోత్సవం జరగ్గా అల్లుడు సురేష్ జ్యోతిని పుట్టింటికి తీసుకువచ్చి వదిలి వెళ్లాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఇది ప్రమాదం కాదని ముమ్మాటికీ మేడిశెట్టి సురేష్ ఇళ్లు తగులబెట్టి చంపాడని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. సురేష్ అల్లవరం గ్రామంలో భార్య జ్యోతితో కలిసి అద్దెకు ఉండేవాడని, అక్కడా ఓ సారి అగ్నిప్రమాదం జరిగిందని, అప్పుడు అతనిపై అనుమానాలున్నాయని యువతి బంధువులు అంటున్నారు. 



(మృతురాలు, యువతి తల్లి)


గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు 


శనివారం తెల్లవారు జామున ఓ తెలుపు రంగు హెూండా యాక్టీవా వాహనంపై మాస్కులు పెట్టుకుని, చేతికి గ్లోవ్స్ ధరించి గుర్తుతెలియని యువకుడు, ఓ యువతి వచ్చారని, వారిని తీర్థమహోత్సవానికి లైటింగ్ వేసిన యువకుడు చూసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుల బంధువులు చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని అనుమానితుడైన మృతురాలు జ్యోతి భర్త మేడిశెట్టి సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా ఆల్డా ఛైర్మ న్ యాళ్ల దొరబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి శెట్టిబత్తుల రాజాబాబు, కాపు నాయకుడు కల్వకొలను తాతాజీ తదితర నాయకులు మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. అమలాపురం డీఎఎస్పీ వై. మాధవరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అల్లవరం తహసీల్దార్ ఎన్వీ సాంబశివప్రసాద్, రూరల్ సీఐ వీరబాబు, ఎస్సైలు ప్రభాకరరావు, వెంకటేశ్వరరావు తదితరుల పోలీస్ అధికారులు, క్రైం బృందం మృతదేహాలను పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరబాబు వెల్లడించారు.