East Godavari Crime News: కలికాలం సినిమా గుర్తుందిగా... అందులో బీమా సొమ్ముల కోసం తండ్రి చంద్రమోహన్ చనిపోయినట్లు కుమారులు నాటకమాడతారు. తీరా అబద్ధాన్ని నిజం చేసే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో చూశారుగా.. సరిగ్గా అలాంటి పథకాన్నే రచించిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బొందలో నుంచి బయటకు తీసి మరోసారి చంపేశాడు. ఈ వ్యవహారం బెడిసికొట్టి కటకటాలపాలయ్యాడు..


సినిమా కథను తలపించేలా పథకం తూర్పుగోదావరి(East Godavari) జిల్లాలో జరిగింది. రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన ధాన్యం వ్యాపారి కేతమళ్ల వెంకటేశ్వరరావు అందినకాడికి అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక ఓ మంచి స్కెచ్‌ వేశాడు. తాను చనిపోతే వచ్చే బీమా సొమ్ములతో అప్పులన్నీ తీర్చవచ్చని పథకం పన్నాడు.


దీనికి ఓ సరికొత్త ఆలోచన చేశాడు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకొచ్చి గుర్తుపట్టకుండా కాల్చివేసి తానే చనిపోయినట్లు నమ్మించాలనుకున్నాడు. కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి... బాకీలన్నీ తిరిన తర్వాత వేరొక ఊరులో హాయిగా బతకొచ్చిన భ్రమపడ్డాడు. శవాన్ని తీసుకొచ్చి ఇచ్చేందుకు మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో ఒప్పందం చేసుకున్నాడు. 


సరైన సమయం కోసం ఎదురుచూస్తుండగా...ఈనెల 23న పాతబొమ్మూరుకు చెందిన ఓఎన్‌జీసీ(Ongc) ఇంజినీర్ విజయరాజు చనిపోయారు. కుటుంబీకులు మరుసటిరోజు స్థానిక శ్మశానవాటికలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులూ పూడ్చిపెట్టిన శవపేటిక నుంచి విజయరాజు మృతదేహాన్ని 25వ తేదీన దొంగిలించారు. 


ధాన్యం వ్యాపారి చెప్పినట్లుగా మర్నాడు ఆ మృతదేహాన్ని వీరంపాలెం తీసుకెళ్లి ఓ పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద పెట్రోలు పోసి తగులబెట్టారు. అక్కడే వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య చెప్పు, సెల్‌ఫోన్ విడిచిపెట్టి పరారయ్యారు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి మృతదేహం పూసయ్యదేనని భావించి గ్రామస్థులు కాలిన శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.


అంతా వెంకటేశ్వరరావు అనుకున్నట్లే జరిగింది కానీ భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య... తానూ చనిపోతానంటూ రోదించడం తెలుసుకుని భయపడ్డాడు. ఈ పథకం భార్యకు తెలిస్తే బయటపడిపోతుందనో లేక ఆమె న్యాచ్‌రల్‌గా ఏడవకపోతే మొదటికే మోసం వస్తుందని భావించాడేమో కానీ ఆమెకు మాత్రం విషయం చెప్పలేదు. కానీ ఇంటి వద్ద ఇద్దరు యువకులను కాపలాపెట్టాడు 


ఇంటి వద్ద విషయాలను ఎప్పటికప్పుడు ఆ ఇద్దరు యువకులు వెంకటేశ్వరరావు చేరవేస్తూనే ఉన్నారు. బాధపడుతున్న భార్యకు విషయం ఎలాగైనా చెప్పాలని భావించి మరో పథకాన్ని రూపొందించాడు. గుర్తుతెలియని యువకులు ఎవరో పొలంలో ఓ మృతదేహాన్ని తగులబెడుతుండగా...అడ్డుకున్నానని దీంతో వారు తనను ఆటోలో తీసుకెళ్లి దూరంగా తుప్పల్లో పడేసినట్టు ఫోన్ చేసి చెప్పాడు. 


చనిపోయాడనుకున్న భర్త బతికే ఉన్నాడని ఆమె ఆనందంతో తబ్బిఉబ్బయ్యింది. విషయం కాస్త పోలీసులకు చేరింది. అంతే పోలీసులు రంగ ప్రవేశం చేసి పొలంలో తగులబెట్టిన మృతదేహాం ఎవరిదన్న కోణంలో ఆరా తీశారు. పూసయ్య వ్యవహారంపై అనుమానం రావడంతోపాటు కొందరు యువకులు తనను కొట్టారని చెప్పినా... ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోలీసులు... తమదైన శైలిలో విచారించారు. 


పోలీస్‌ మార్క్ విచారణతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడికి సహకరించిన ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బీమా సొమ్ముల కోసం ఆశపడి అడ్డదారులు తొక్కిన పూసయ్య ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. అతనికి సహకరించిన వారు సైతం కేసుల్లో ఇరుక్కున్నారు.