హవాలా దందా చేస్తున్న ముగ్గురిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 34.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ నికిత పంత్ తెలిపిన వివరాల ప్రకారం... శివరాంపల్లి కి చెందిన శివన్ష్ రాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మహమ్మద్ మన్సూర్ అతని వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా నల్లగుట్ట ప్రాంతానికి చెందిన వ్యాపారి భావేష్ కుమార్ తో శివాన్ష్ రాయ్ ఇద్దరు స్నేహితులు. వీరిద్దరికి కొందరు హవాలా ఏజెంట్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. 


ఈ క్రమంలో తేలికగా డబ్బు సంపాదించడానికి ఇద్దరు కలిసి హవాలా దందా మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి కస్టమర్ల నుంచి వసూలు చేసిన 34.50 లక్షలను కలెక్ట్ చేసి ఇద్దరు... డ్రైవర్ మహమ్మద్ మన్సూర్ తో కలిసి కిమ్స్ హాస్పిటల్ వద్ద నగదును డెలివరీ చేయడానికి కారులో వచ్చారు. ఈ మేరకు పక్కాగా సమాచారం అందుకున్న టాస్క్ఫోసిఐ రాజు నాయక్, ఎస్సైలు సాయికిరణ్, నవీన్ కుమార్ తో పాటు సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం రాంగోపాల్ పేట పోలీసులకు అప్పగించారు. 


ఇటీవల కొన్ని సంఘటనలు


హైదరాబాద్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా నిందితులు మన్‌ప్రీత్ సింగ్, షేక్ అర్షద్ అనుమానాస్పదంగా స్కూటర్ పై వెళుతుండగా వారి స్కూటర్ ను పోలీసులు ఆపి తనిఖీ చేయగా వారి వద్ద రూ.10 లక్షల అక్రమ నగదు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి అక్రమ డబ్బుపై విచారణ చేపట్టారు. నిందితులు మన్‌ప్రీత్ సింగ్, షేక్ అర్షద్ సంబంధం లేని సమాధానాలు ఇస్తున్నారని, డబ్బుకు సరైన లెక్క చూప నందున వారిపై కేసు నమోదు చేసుకొని రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు స్కూటర్, రెండు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


అంబర్‌పేట్‌లో మన్‌ప్రీత్ సింగ్ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నట్లుగా తమ విచారణలో తేలింది అని పోలీసులు తెలిపారు. హవాలా నగదు బదిలీ ఏజెంట్లతో పరిచయం పెంచుకున్న మన్‌ప్రీత్ సింగ్ అక్రమ హవాలా నగదు బదిలీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. మన్‌ప్రీత్‌ సింగ్వి విధ ప్రాంతాలలో ఉన్న హవాలా బ్రోకర్లకు ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో డబ్బు సరఫరా చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. 


హైదరాబాద్‌లో హవాలా మనీ పెద్ద మొత్తంలో చేతులు మారుతోంది. తాజాగా శనివారం రాత్రి కోకాపేట్ నుంచి నార్సింగ్ వైపు వెళ్తున్న రెండు కార్లలో సుమారు కోటి రూపాయలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లలో నగదు తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు. అయితే డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారని పోలీసులు నిందితులను విచారించడంతో విషయం బయటపెట్టారు. కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్‌ అనే ఇద్దరు వ్యక్తులకు పోలీసులు పట్టుకున్న కోటి రూపాయలు ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్లుగా తెలిపారు. హవాలా మనీ పట్టుకున్న పోలీసులు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.