చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం మరో కేసు పెట్టింది. ఇప్పటికే వివిధ రకాల కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు తాజాగా మధ్యం విషయంలో మరో కేసు పెట్టారు. టీడీపీ హాయాంలో లిక్కర్ కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని సీఐడీ ఆరోపిస్తోంది. దీనిపైనే పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చట్టం కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ - 3గా చేర్చారు. ఈ కేసు చంద్రబాబుపై నమోదు చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి విచారణ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతించింది.


ఇప్పటికే చంద్రబాబుపై కొన్ని కేసులను ఏపీ సీఐడీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ స్కిల్ స్కామ్ కేసుతో పాటుగా అంగళ్లు అల్లర్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసింది. వీటికి సంబంధించి సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వివిధ పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి. 


సుప్రీంలో తీర్పు రిజర్వ్


సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది. మరోవైపు, ముందస్తు బెయిల్‌పై తీర్పు రావాల్సి ఉంది.