Double Murder in Palnadu | దుర్గి: పల్నాడు జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. రాజకీయంగా, వ్యక్తిగతంగా సున్నితమైన ఈ ప్రాంతంలో ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి ఇద్దరు అన్నదమ్ములను దారుణంగా నరికి చంపారు. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. మృతులను హనుమంతు, అతడి సోదరుడు శ్రీరాంమూర్తిగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ కలహాలతో ఈ జంట హత్యలు జరిగినట్లు సైతం ప్రచారం జరుగుతోంది.
మృతులిద్దరూ తెలుగుదేశం పార్టీ (TDP) సానుభూతిపరులు కావడంతో ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. హనుమంతు, శ్రీరాములు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన దుర్గి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించినట్లు సమాచారం.
గతంలోనూ పల్నాడులో జంట హత్యల కలకలంపల్నాడు జిల్లాలో గతంలో జరిగిన హింసాత్మక ఘటన మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కేసు తెలిసిందే. 2024 ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దీనితో పాటు అదే సమయంలో జరిగిన డబుల్ మర్డర్ కేసు, కారంపూడిలో సిఐపై దాడి చేసిన ఘటనల్లోనూ కేసులు నమోదయ్యాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వర్లు హత్యకు గురైన కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు.
ఈ వరుస హింసాత్మక ఘటనల కేసులో పిన్నెల్లి సోదరుల్ని పోలీసులు గతంలో అరెస్టు చేయగా, తరువాత బెయిట్ మీద బయటకు వచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేయడం, లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పిన్నెల్లి సోదరులు వారం రోజుల కిందట లొంగిపోయారు.