ఆమె ఎప్పట్లాగే ఏడ్చి ఏడ్చి పడుకుంది. సరిగ్గా అన్నం కూడా తినలేదు. కొంత కాలంగా ఆమెకు అదే దినచర్య. కుటుంబంలో కలహాలు ఆమెకు అలాంటి పరిస్థితి కల్పించాయి. ఆ రాత్రి కూడా అంతే నిద్రపోయింది .. తెల్లవారు లేచింది. కానీ గదిలో నుంచి బయటకు రాలేకపోయింది. డోర్ తెరవలేకపోయింది. ఎందుకో అర్థం కాలేదు. కానీ అర్థం చేసుకున్న తర్వాత కూలబడిపోయింది. ఎందుకంటే బయట నుంచి తాళాలు వేస్తే సరే కుటుంబకలహాల్లో మరో స్టేజ్ చేరిందని అనుకునేది . కానీ తలుపు బయట ఏకంగా గోడ కట్టేశారు. దీంతో ఆమె మనసు వికలమయింది. తెలిసిన వారికి ఫోన్లు చేసి.. ఎలాగోలా వేరే మార్గం చూసుకుని బయటకు వచ్చింది. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదేమీ సినిమా స్టోరీ కాదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుల్లారెడ్డి స్వీట్స్ వ్యాపార సంస్థల వారసుడు ఏక్‌నాథ్ రెడ్డి చేసిన ఘనకార్యం.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేశామని చెబుతున్నారు. సమాజంలో గౌరవనీయమైన కుటుంబం కావడంతో వీలయినంత వరకూ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు రెండు కుటుంబాలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఈ కేసు విషయంపై ప్రాథమిక వివరాలు మాత్రమే వెల్లడించారు.