Disha Fake Encounter : దిశ అత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ పేర్కొంది. కమిషన్ 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్‌ సూచించింది. నిందితులు పోలీసులపై దాడి చేశారని, ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మేలే లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పూర్కర్‌ కమిషన్‌ పేర్కొంది. పోలీసులు వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మాధర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు ఎస్.అర్వింద్ గౌడ్, డి.జానకిరాం, ఆర్.బాలూ రాఠోడ్, డి.శ్రీకాంత్‌పై విచారణ జరపాలని సిర్పూకర్ కమిషన్‌ సూచించింది. ఈ పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద విచారణ చేయాలని నివేదికలో కమిషన్ పేర్కొంది. 


అసలేం జరిగింది? 


2019 నవంబర్ 28న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దిశపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి, పెట్రోల్ పోసి కాల్చేశారు. ఆ దారుణ ఘటన మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరికి దిశను హత్యాచారం చేసింది నలుగురు యువకులను గుర్తించి వారిని పోలీసులు అరెస్టు చేశారు. దిశకు న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. నవంబర్ 29 న దిశ కేసులో సైబరాబాద్ పోలీసులు నిందితులు నలుగురు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్  అరెస్టు చేశారు. నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తారని పోలీసులు గుర్తించారు. 





అయితే పోలీసుల కథనం ప్రకారం... నలుగురు నిందితులను డిసెంబర్ 6, 2019 తెల్లవారుజామున సంఘటన జరిగిన ప్రదేశానికి పోలీసులు తీసుకెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల పైకి తిరగడంతో వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్,  చెన్నకేశవులు ఈ ఎన్ కౌంటర్ మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ పై ఆందోళనలు వెల్లువెత్తడంతో ఎన్ కౌంటర్ ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ నియమించింది. ఈ కమిషన్ సభ్యులు ఎన్ కౌంటర్ ప్రదేశాన్ని, దిశను కాల్చేసిన ప్రదేశాన్ని పరిశీలించి, అన్ని కోణాల్లో విచారణ చేసి సుప్రీంకోర్టుకు నివేదిక అందించారు.