Lokesh On Mlc Car Dead Body Isssue : కాకినాడలో ఎమ్మెల్సీ కారులో మృతదేహం రాష్ట్ర వ్యాప్తంగా సంచలమైంది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు. ఏపీని బిహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా వైసీపీ మార్చేసిందని విమర్శించారు. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారన్నారు. ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రమణ్యంను అత్యంత దారుణంగా హత్య చేసి, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? అని నిలదీశారు. ఎమ్మెల్సీ అనంత బాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
కాకినాడలో సుబ్రమణ్యం ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుబ్రమణ్యం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు వచ్చారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు. అనంతబాబును అరెస్ట్ చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగింది?
కాకినాడి జిల్లాలో ఎమ్మెల్సీ అనంత ఉదయ బాబు కారులో మృతదేహం కలకం రేపుతోంది. ఎమ్మెల్సీ అనంతబాబు కారుకు డ్రైవర్ గా పనిచేసిన వీధి సుబ్రమణ్యంని నిన్న రాత్రి తన పుట్టిన రోజు వేడుకకు రావాలని స్వయంగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కాకినాడ వచ్చి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం తెల్లవారు జామున 2 గంటలు తరువాత మృతుని సోదరునికి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు ఫోన్ చేసి సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, టిఫిన్ కు బైక్ పై వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి చనిపోయాడని చెప్పారు. ఆ తరువాత ఎమ్మెల్సీ స్టిక్కరు ఉన్న కారులో మృతదేహాన్ని కొందరు కాకినాడ తీసుకొచ్చారని చెబుతున్నారు. అయితే ఆ సమయంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కూడా వేరే కారులో వచ్చారని, తన తమ్ముడు ఎలా చనిపోయాడని, ప్రశ్నిస్తే రేపు చూసుకుందామని అక్కడి నుంచి వెళ్లిపోయారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. డ్రైవరు మృతదేహానికి మోకాళ్లు, పలు చోట్ల మట్టి అంటుకుందని, కాళ్లు, చేతులు విరిచేశారని కుటుంబీకులు చెబుతున్నారు. అయితే పోలీసులు కూడా మృతదేహంపై ఉన్న మట్టిని పరిశీలించారు. మృతుని కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంటు సీసీ కెమెరా పుటేజీల్లో కూడా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు వచ్చినట్లు, అక్కడి నుంచి వేరే కారులో వెళ్లి పోయినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
జన్మదిన వేడుకలకు రమ్మని
మృతదేహాన్ని అప్పగించడానికి కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబుతో కూడా వచ్చిన వారు మద్యం సేవించి ఉన్నారని, తమ సోదరుడు ఎలా చనిపోయాడు.. కచ్చితంగా చంపేశారని తామంతా వాదించామని అయితే ఆ సమయంలో రేపు మట్లాడదాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్న క్రమంలో కారుకు అడ్డంగా పడుకోవడంతో ఆ కారు అక్కడే వదిలేసి వేరే కారులో వెళ్లిపోయారని చెబుతున్నారు.
ఎమ్మెల్సీ చంపించాడంటూ ఆరోపణ
మృతదేహం మోకాళ్లుకు ఎర్రటి మట్టి అంటుకుని, కాళ్లు, చేతులు విరిచేసి ఉన్నాయని, కేవలం తమ బిడ్డను అనంతబాబు, అతని అనుచరులే చంపించారని మృతుడు సుబ్రమణ్యం కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ కారు డ్రైవరుగా పనిచేసిన సుబ్రహ్మణ్యం 30 వేల రూపాయలు అప్పు తీసుకున్నారని, అంతే తప్ప మాకు ఇంకేమీ తెలియదని చెబుతున్నారు. అయితే బర్త్ డే సెలబ్రేషన్ అంటూ స్వయంగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు దగ్గరుండి తీసుకెళ్లి తిరిగి శవాన్ని తీసుకొచ్చారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరాతీస్తున్నారు. అయితే మృతదేహాన్ని తీసుకొచ్చిన కారు ఏపీ 39 బీ 0456 దొంగ నెంబర్లో రిజిస్ట్రేషన్లో ఉందని తెలుస్తోంది. డ్రైవర్ మృతి గురించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీకని తీసుకెళ్లిన వ్యక్తి టిఫిన్ చేసేందుకు ఎందుకు వెళతాడని, ఆ సమయంలో బైక్ పై వెళ్తే యాక్సిడెంట్ అయ్యిందని చెబుతున్నారని, అయితే యాక్సిడెంట్ అయిన బైక్ ఏమైందని ప్రశ్నిస్తే ఆ బైక్ యజమాని తీసుకెళ్లిపోయాడని ఇలా పొంతనలేని సమాధానం ఎమ్మెల్సీ చెప్పారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.