CM Jagan Davos Tour : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలదేరారు. శుక్రవారం ఉదయం అమరావతి నుంచి బయలుదేరి రాత్రి 8.30కు స్విట్జర్లాండ్ లోని దావోస్ చేరుకోనున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకూ దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. సీఎంతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్ నాథ్, అధికారులు ఉన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంపై దావోస్ సమ్మిట్ లో సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 2200 మంది పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సదస్సులో సీఎం జగన్ వివరించనున్నారు. దావోస్ సదస్సులో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేశారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
ఏపీకి పెట్టుబడులను ఆకర్షణే లక్ష్యంగా దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ పర్యటనలో పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా అడుగులు వేసేందుకు దావోస్ లో కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో చేపట్టిన పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పారిశ్రామికీకరణకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ సమ్మిట్ లో సదస్సులో వివరించనున్నారు. బెంగళూరు-హైదరాబాద్, చెన్నై- బెంగుళూరు, విశాఖపట్నం- చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక సంస్థలకు తెలియజేయనున్నారు.
ఏపీ ప్రగతి ప్రపంచ వేదికపై
కరోనా పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని ఏపీ సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా సీఎం జగన్ బృందం వివరించనుంది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం భాగస్వామం అవుతుందని చెప్పనున్నారు. కాలుష్య రహిత పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని దావోస్ సదస్సులో సీఎం బృందం వివరించనుంది. ఇంటర్ కనెక్టివిటీ, రియల్ టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌లను ఇండస్ట్రీయల్ రివల్యూషన్ లో భాగం చేయాలని ఈ సదస్సు వేదికగా సీఎం జగన్ చెప్పనున్నారు. ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన మార్పులు, నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో వచ్చిన మార్పులను సీఎం జగన్ తెలియజేయనున్నారు. సంప్రదాయ ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి అంశాలపై ఈ సదస్సులో వివరించనున్నారు.
ఏపీ పెవిలియన్
ఈ అంశాలను వివరిస్తూ దావోస్‌లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేసింది. పీపుల్ –ప్రోగ్రెస్ – పాజిబిలిటీస్ నినాదంతో ఈ పెవిలియన్ నిర్వహిస్తోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా హాజరయ్యే ప్రతినిధులతో కూడిన దావోస్ కాంగ్రెస్ పలు కీలక అంశాలపై దృష్టిపెట్టనుంది. ఆహారం – వాతావరణ మార్పులు, సాంకేతిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు, సుపరిపాలన, సైబర్ సెక్యూరిటీ, అంతర్జాతీయ సహకారం – పునర్ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత, అందరికీ ఆరోగ్యంపై జరిగే చర్చల్లో ఏపీ భాగస్వామ్యం కానుంది.