Delhi Railway Station: 


ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఘటన..


న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కరెంట్ షాక్‌తో చనిపోయింది. మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. గత రాత్రి నుంచి ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. ఈస్ట్ ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో ఉంటున్న బాధితురాలు సాక్షి అహుజా...ఉదయం 5.30 నిముషాలకు ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులతో కలిసి రైల్వే స్టేషన్‌కి వచ్చింది. ఓ చోట నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ పోల్‌ని పట్టుకుని పక్క నుంచి దాటాలని ప్రయత్నించింది. ఎప్పుడైతే ఆ పోల్‌ని పట్టుకుందో హైవోల్టేజ్ శరీరంలోకి పాస్ అయింది. ఈ దెబ్బకు ఆమె పడిపోయింది. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు వెంటనే గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. ఆ పోల్‌ కింద కొన్ని ఎలక్ట్రిక్ వైర్‌లకు ఎలాంటి ప్రొటెక్షన్ వేయకుండా వదిలేశారు. అవి తగిలే ఆమె మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై అటు రైల్వేతో పాటు పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.