Padi Kousik Reddy News: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి నిరసనల సెగ తగిలింది. నిరసనకారులు ఆయన దిష్టిబొమ్మకు చెప్పుల దండతో శవయాత్ర నిర్వహించారు. కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని, పదవి నుంచి తొలగించి వెంటనే అరెస్ట్ చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆదివారం (జూన్ 25) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలోని కుమ్రంభీం చౌరస్తా వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. హుజూరాబాద్ లో ముదిరాజ్ కులానికి చెందిన విలేకరిని బూతు మాటలు తిడుతూ కౌశిక్ రెడ్డి చిత్రహింసలు పెట్టారని వారు ఆరోపించారు. కౌశిక్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దిష్టి బొమ్మ దహనం చేశారు.


హుజూరాబాద్‌లో కొద్ది రోజుల కిందట ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కెమెరామెన్‌ను కౌశిక్ రెడ్డి తీవ్రమైన అసభ్య పదజాలంతో తిట్టినట్లుగా భావిస్తున్న ఆడియో ఒకటి వైరల్‌ అయింది. బాధితుడు అజయ్‌ తనకు కౌశిక్‌ రెడ్డి వల్ల ప్రాణహాని ఉందని ఓ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. తాను గురువారం హుజూరాబాద్‌లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన సందర్భంగా.. అక్కడ ఓ మహిళ ఎమ్మెల్సీని ఏదో సమస్యపై అడుగుతున్నారని.. తాను అటువైపు వీడియో తీస్తుండగా కౌశిక్‌ అనుచరులు వీడియో తీసే సెల్‌ఫోన్‌ లాక్కెళ్లిపోయారని బాధితుడు వాపోయాడు. అది తెచ్చుకోడానికి ఎమ్మెల్సీ కార్యాలయానికి వెళ్తే ఎమ్మెల్సీ అసభ్య పదజాలంతో తనపై దాడి చేశారని అన్నారు. కులం పేరుతో దూషించారని వాపోయారు.


స్పందించిన కౌశిక్‌ రెడ్డి


ఈ వివాదాస్పద వ్యవహారంపై కౌశిక్ రెడ్డి స్వయంగా స్పందించారు. కెమెరామెన్‌ను తాను కులం పేరుతో దూషించానని అనడం తప్పు అని ఖండించారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిజంగా తాను ఆ పని చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఇంకో ఇద్దరు కలిసి తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. 


పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు


తన ప్రతిష్ఠ దిగజార్చేందుకు కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా ఇటీవల ఫిర్యాదు చేశారు. ముదిరాజ్ వ్యక్తిని దూషించినట్లుగా వైరల్ అయిన ఆడియో తనది కాదని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేసినందుకు యూట్యూబ్ ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆ ఆడియో పేరుతో తీన్మార్ మల్లన్న కూడా యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేశారని, అవి ఫేక్ వార్తలని కొట్టిపారేశారు. ఈటల రాజేందర్ కావాలని చేయిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి ప్రమాణం చేయాలంటూ ఈటల రాజేందర్ కు సవాలు విసిరారు.


ముదిరాజ్ బిడ్డలంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. తాను ఎప్పుడు ముదిరాజ్ బిడ్డలపై తప్పుడు మాటలు మాట్లాడలేదని, తాను పెద్దమ్మతల్లి మీద ప్రమాణం చేయడానికి కూడా రెడీ అని అన్నారు. తాను అనని మాటలను అన్నట్లు ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.