Delhi University News: దిల్లీ విశ్వవిద్యాలయంలో తోటి విద్యార్థుల దాడిలో నిఖిల్ చౌహాన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చిన మృతుని తండ్రి సంజయ్ చౌహాన్.. కొడుకు మృతిని తట్టుకోలేక కన్నీరు మున్నీరయ్యారు. మీడియా ముందే బోరున విలపించారు. అంతకుముంద, తన కొడుకును తోటి విద్యార్థులు కత్తితో పొడిచారని కాల్ రావడంతో ఆస్పత్రికి బయలు దేరినట్లు తెలిపారు. కానీ అప్పటికే నిఖిల్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారని మీడియాతో చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. 


నిఖిల్ కు మోడలింగ్ చేయాలని ముంబై నుంచి కాల్ వచ్చిందని.. పరీక్షలు ఉన్నందున అవి పూర్తయ్యాక వెళ్లాలని తానే నిఖిల్ కు చెప్పి ఒప్పించినట్లు సంజయ్ చౌహాన్ తెలిపారు. పరీక్షల అనంతరం ముంబైకి పంపడానికి అన్ని సిద్ధం చేస్తున్న తరుణంలోనే నిఖిల్ హత్యకు గురికావడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నిందితులెవరో తమకు తెలియదని సంజయ్ చెప్పారు. నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. నిఖిల్ ను చంపడానికి 10, 15 మంది బైకులపై, మెట్రోలో వచ్చారని చెప్పారు. నిఖిల్ గుండె దగ్గర బలమైన కత్తిపోటు వల్లే తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయినట్లు సంజయ్ చౌహాన్ మీడియాతో వెల్లడించారు. నిఖిల్ కు మోడలింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా చాలా ఇష్టమని అతని తల్లి సోనియా చౌహాన్ తెలిపారు. నిఖిల్ చేసిన రెండు పాటలు యూట్యూబ్ లో విడుదల అయినట్లు చెప్పారు. మరికొన్ని పాటల్లో నటించబోతున్నట్లు కూడా ఆమె చెప్పుకొచ్చారు.


Also Read: Honor Killing: మధ్యప్రదేశ్‌లో దారుణం, ప్రేమికులను చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన కుటుంబ సభ్యులు


నిఖిల్ ను కత్తితో పొడిచి చంపిన తోటి విద్యార్థులు


దేశ రాజధానిలోని దిల్లీ విశ్వవిద్యాలయంలో ఆదివారం హత్య కేసు వెలుగుచూసింది. యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లోని ఆర్యభట్ట కళాశాల వెలుపల విద్యార్థులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో పశ్చిమ్ విహార్ కు చెందిన నిఖిల్ చౌహాన్(19) అనే విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (SOL) లో మొదటి సంవత్సరం బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు నిఖిల్ చౌహాన్. 


వారం రోజుల క్రితం.. కాలేజీలో నిఖిల్ స్నేహితురాలితో ఓ విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించగా, వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది అంతటితో ముగిసిపోయిందని నిఖిల్ భావించాడు. కానీ ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో నిఖిల్ స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించిన అదే విద్యార్థి ఓ గ్యాంగ్ ను తీసుకుని వచ్చి నిఖిల్ తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో వారంతా కలిసి నిఖిల్ పై దాడి చేశారు. దాదాపు 10 నుంచి 15 మంది నిఖిల్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇంతలో ఓ వ్యక్తి నిఖిల్ ఛాతీపై కత్తితో పొడిచినట్లు సమాచారం. గుండెకు దగ్గరగా బలంగా కత్తితో పొడవడంతో నిఖిల్ తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొందరు విద్యార్థులు రక్తమోడుతున్న నిఖిల్ ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.