Delhi Police Road Accident: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్ ను దుండగులు కారుతో ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మరణించాడు. శనివారం రాత్రి మద్యం స్మగ్లర్లు నంగ్లోయ్‌(Nangloi)లోని చెక్‌పాయింట్‌లో పోలీసు కానిస్టేబుల్‌(Police Constable) బైకు మీద వెళ్తుండగా కారుతో ఢీ కొట్టారు. తర్వాత 10 మీటర్ల దూరం వరకు బైకుతో సహా కానిస్టేబుల్ ను ఈడ్చుకెళ్లారు.


ఈ ఘటనలో కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలంలో ఉన్న ఇతర పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ(CCTV) ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. వీడియోలో బైక్‌‌ను ఆపి నిలబడి ఉన్న కానిస్టేబుల్ సందీప్.. అత్యంత వేగంగా వస్తున్న కారును గమనించి, ఆపాలని సిగ్నల్ ఇచ్చాడు. అయినా, కారు డ్రైవర్ పట్టించుకోకుండా కారు వేగం మరింత పెంచాడు. అత్యంత వేగంగా వచ్చి బైకుతో సహా కానిస్టేబుల్‌ను ఢీకొట్టాడు. అనంతరం సుమారు 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. 
 
వేగంగా దూసుకొచ్చిన కారు
ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన  చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..యాక్సిడెంట్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో కొందరు పోలీసులు మఫ్టీలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మఫ్టిలో ఉన్న కానిస్టేబుల్  సందీప్ కూడా ఆ ప్రాంతంలో పెరుగుతున్న చోరీ కేసులపై దర్యాప్తు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన బైక్(Bike) పక్కన నిలబడి ఉండగా.. అటువైపుగా మారుతి సుజుకీ వేగనార్ కారు అతివేగంగా వస్తోంది. దీనిని గమనించిన ఆయన కారును ఆపడానికి ట్రై చేశారు. దీంతో మరింత వేగంతో నిందితుడు.. బైక్‌‌ పక్కన ఉన్న కానిస్టేబుల్‌ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సందీప్‌(sandeep)ను అక్కడున్న మరి కొంతమంది పోలీసులు ఆసుపత్రి(Hospital)కి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.







మద్యం తరలిస్తున్నట్లు అనుమానం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఇద్దరు ఉన్నట్టు తెలిపారు. నిందితులు యాక్సిడెంట్ చేసిన తర్వాత కారును అక్కడే వదలి పరారయ్యారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఘటనా స్థలం చుట్టూ అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.  కారులో మద్యం(Liquor) తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, తనిఖీల్లో ఎటువంటి మద్యం బాటిళ్లు లభ్యం కాలేదని తెలుస్తోంది.  ఈ ఘటన కొన్నేళ్లుగా  దేశ రాజధానిలో  పెరుగుతోన్న రోడ్డు ప్రమాదాలకు అద్దం పడుతోంది. పలువురు తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, ఢిల్లీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ట్వీట్ చేశారు. ‘ఢిల్లీలో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయి.. పూర్తిగా ఆటవిక పాలనలో ఉంది. దేశ రాజధానిలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు.. శాంతిభద్రతల వ్యవస్థ  హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోకి వస్తుంది. ఈ ఘటనలను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. 


Also Read :  ఢిల్లీలో రోడ్లపై నడవడం అంత ప్రమాదకరమా? రాత్రి 9 నుంచి 2 గంటల వరకు అసలు బయటకు రావద్దా?