Delhi Road Rage Case:
దారివ్వలేదని దాడి
సిటీ ట్రాఫిక్ అంటే పద్మవ్యూహమే. అందులోకి వెళ్లడమే మన వంతు. ఆ తరవాత ఎప్పుడు ఎలా బయటకు వస్తామో అర్థం కాదు. కొందరు రూల్స్ పాటించకుండా ఇష్టమొచ్చినట్టు నడిపేస్తారు. మరి కొందరైతే దారి ఇవ్వాలంటూ పదేపదే హార్న్ కొడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే చాలా సార్లు గొడవలు జరుగుతుంటాయి. ఢిల్లీలో ఇదే జరిగింది. కార్‌కి దారివ్వలేదన్న కోపంతో డెలివరీ బాయ్‌ని దారుణంగా కొట్టి చంపారు. నిందితులిద్దరూ 20 ఏళ్ల లోపు వాళ్లే. ఢిల్లీలోని రంజీత్ నగర్‌లో ఈ ఘోరం వెలుగు చూసింది. మనీశ్ కుమార్, లాల్‌చంద్ అనే ఇద్దరు యువకులు డెలివరీ బాయ్‌ని కొట్టి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి పూట ఈ గొడవ జరిగినట్టు వివరించారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారని చెప్పారు. అయితే...అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. మృతుడు పంకజ్ ఠాకూర్ శరీరంపై గాయాలున్నట్టు గుర్తించారు. మృతుడి వద్ద ఉన్న డాక్యుమెంట్‌ల ఆధారంగా ఐడెంటిటీని కనుగొన్నారు. ఓ షాప్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నాడని, సరుకులను డెలివరీ చేసే క్రమంలోనే ఈ గొడవ జరిగిందని పోలీసులు చెప్పారు.
నిందితులు అరెస్ట్
పంకజ్‌కు ఇద్దరు పిల్లలున్నారు. అతడి మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. విచారణలో భాగంగా ఘటనా స్థలంలోని సీసీటీవీలను పరిశీలించారు పోలీసులు. ఇద్దరు వ్యక్తులు ఓ క్యాబ్ నుంచి బయటకు వచ్చి ఠాకూర్‌తో గొడవ పడటాన్ని గమనించారు. ఉన్నట్టుండి అతడిపై దాడికి దిగారు. గట్టిగా కొట్టారు. వెంటనే పంకజ్ కింద పడిపోయాడు. కంగారు పడిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
సీసీ కెమెరా విజువల్స్ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అప్పటికే వాళ్లిద్దరూ పరారయ్యారు. అన్ని చోట్లా జల్లెడ పట్టి మొత్తానికి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. తాము వెళ్తున్న దారిలో పంకజ్ అడ్డంగా నిలబడ్డాడని, దారి ఇవ్వలేదన్న కోపంతో దాడి చేశామని వాళ్లు అంగీకరించారు. కార్‌తో పంకజ్ స్కూటర్‌ని ఢీ కొట్టిన తరవాతే గొడవ పెద్దదైందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆ కార్‌ని సీజ్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
గతేడాది కూడా దిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. అర్జాన్‌ఘర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై వెళ్తున్న బైకర్ల గ్యాంగ్‌తో స్కార్పియో వాహనంలో వెళ్తున్న డ్రైవర్‌కు వాగ్వాదం జరిగింది. అయితే ఎంతకూ ఇది ఆగకపోవడంతో స్కార్పియో డ్రైవర్ తన వాహనంతో ఓ బైకర్‌ను ఢీ కొట్టాడు. దీంతో ఆ బైకర్ కిందపడిపోయాడు. ఆ తర్వాత స్కార్పియో డ్రైవర్ వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని మరో బైకర్ తన హెడ్‌గేర్ కెమెరాతో చిత్రీకరించాడు. గాయపడ్డ బైకర్‌ను 20 ఏళ్ల శ్రేయాన్ష్‌గా గుర్తించారు. ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌పై ట్రిప్‌కు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
Also Read: Divorce Celebration: విడాకులను సెలబ్రేట్ చేసుకున్న మహిళ, పెళ్లి డ్రెస్‌ని మంటల్లో కాల్చేస్తూ ఆనందం