Delhi Crime News:



వెస్ట్ ఢిల్లీలో ఘటన..


భార్యపై కసి పెంచుకున్నాడు. ఎలాగైనా సరే చంపేయాలనుకున్నాడు. తన వల్ల కాదని తెలిసి కిరాయి హంతకులను మాట్లాడుకున్నాడు.  చివరకు పంతం నెగ్గించుకున్నాడు. ఢిల్లీలో జరిగిందీ దారుణం. 35 ఏళ్ల భార్యను 71 ఏళ్ల భర్త దారుణంగా చంపించాడు. వెస్ట్ ఢిల్లీ రాజౌరీ గార్డెన్‌లో ఈ హత్య జరిగింది. వెంటనే స్పాట్‌కి వెళ్లిన పోలీసులు..మహిళ మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై కత్తి పోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అయితే..విచారణ చేపట్టిన తరవాత అసలు డొంకంతా కదిలింది. గతేడాది నవంబర్‌లో ఎస్‌కే గుప్తతో ఆమెకు వివాహం అయినట్టు తేలింది. తన కొడుకుని చూసుకుంటుందన్న ఆశతోనే ఆమెను వివాహం చేసుకున్నాడు ఎస్‌కే గుప్త. కొడుకు దివ్యాంగుడు. కద్దలేని పరిస్థితుల్లో సేవలు చేయాల్సి వచ్చింది. కానీ...భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో గుప్త అసహనానికి గురయ్యాడు. డైవర్స్ కావాలని అడిగాడు. విడాకులివ్వాలంటే కోటి రూపాయల భరణం ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కి ఒప్పుకోని గుప్త..ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని చూశాడు. చంపేయాలని ప్లాన్ చేశాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. తన కొడుకుని తరచూ ఆసుపత్రికి తీసుకెళ్లే వ్యక్తితోనే బేరం కుదుర్చుకున్నాడు. రూ.10 లక్షలు ఇస్తానని చెప్పాడు. అడ్వాన్స్‌గా రూ.2.40 లక్షలు ఇచ్చాడు. 


ఇదీ జరిగింది..


పక్కా ప్లాన్ ప్రకారం...నిందితుడు విపిన్‌తో పాటు మరో వ్యక్తి హిమాన్షు గుప్తా ఇంటికి వెళ్లి ఆయన భార్యపై కత్తితో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచారు. ఈ క్రమంలో నిందితులు కూడా గాయపడ్డారు. పోలీసులను మిస్‌లీడ్ చేయడానికి చోరీ చేసినట్టుగా డ్రామా క్రియేట్ చేశారు. ఇంట్లోని రెండు ఫోన్‌లనూ దొంగిలించారు. చోరీ కేసులా దారి మళ్లించే ప్రయత్నించారు. హత్య జరిగిన సమయంలో గుప్తా కొడుకు అక్కడే ఉన్నాడు. అయితే...ఈ కేసులో ఇతనికీ సంబంధం ఉందని గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నేరాన్ని అంగీకరించారు తండ్రికొడుకులు. ఈ హత్య కోసం వినియోగించిన స్కూటర్‌తో పాటు మొబైల్స్‌ని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. 


నడిరోడ్డుపై వీరంగం..


ఢిల్లీలో నలుగురు యువకులు కార్ డ్రైవర్‌పై దాడి చేశారు. నడిరోడ్డుపై కార్ ఆపేసి..డ్రైవర్‌పై దాడికి దిగిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ప్రవీణ్ జంగ్రా ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాక..ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్ డ్యాష్‌బోర్డ్‌లోని కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. నంగోలి మెట్రో స్టేషన్‌ వద్ద కార్‌ను నలుగురు యువకులు అడ్డగించారు. డిప్పర్ లైట్స్‌ విషయంలో వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ నలుగురు యువకులు కార్‌ ఆపి డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ తరవాత బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు బాధితుడు ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్యాగ్ చేశాడు. 


"కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై నా కార్ ఆపేశారు. నాపై దాడి చేశారు. నంగోలి మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఢిల్లీలో ఈ తరహా గూండాగిరి చాలా మామూలైపోయింది. ఢిల్లీ పోలీసులు దీనిపై దృష్టి సారించాలి. కచ్చితంగా చర్యలు తీసుకోవాలి"


- బాధితుడు