Dead Bodies Found In Mumbai Hoarding Collapse Incident: ముంబయిలోని ఘాట్ కోపర్ (Ghat Koper) వద్ద సోమవారం సాయంత్రం హోర్డింగ్ (Mumbai Hoarding Collapse) కూలిన విషాద ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. సోమవారం పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు, ఈదురుగాలులతో బీభత్సం సృష్టించగా.. సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ ఓ పెట్రోల్ పంపుపై కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు శిథిలాల నుంచి బాధితులను రక్షించారు. ఈ ప్రమాదంలో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి ఓ కారులో 2 మృతదేహాలను గుర్తించారు. శిథిలాలను తొలిగిస్తోన్న క్రమంలో కారులో మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి. మృతులు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) విశ్రాంత మేనేజర్ మనోజ్ చన్సోరియా (60), ఆయన భార్యగా పోలీసులు గుర్తించారు. వీరు రెండు నెలల క్రితమే పదవీ విరమణ చేశారు. అనంతరం వీరు నగరాన్ని వీడి జబల్ పుర్ కు మారారు. పని పూర్తి చేసుకుని జబల్ పూర్ వెళ్తుండగా.. పెట్రోల్ నింపుకొని బంక్ వద్ద కారు ఆపిన సమయంలోనే హోర్డింగ్ కూలి ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజులుగా తల్లిదండ్రులు ఫోన్ ఎత్తకపోవడంతో వారి కుమారుడు ఆందోళనతో ఇక్కడ బంధువులను అప్రమత్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారించగా వారి మరణ వార్త తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అటు, ఈ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు.


నిర్లక్ష్యమే కారణమా.?


ఇప్పటికే, ఈ కేసుకు సంబంధించి ఓ యాడ్ ఏజెన్సీ భవేశ్ బిండేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కూడా ఈ ఘటనకు కారణమనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 40X40 ఉండాల్సిన ఇనుప హోర్డింగ్ ను 120X120 సైజులో చేయించారు. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కే సైజ్ అని ఓ మీడియా కథనం వెల్లడించింది. ప్రమాదానికి గురైన ఈ హోర్డింగ్ కు అనుమతులే లేవని అధికారులు చెబుతున్నారు. దీన్ని ఏర్పాటు చేసేందుకు కొన్ని చెట్లు కూడా నరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి బీఎంసీ 14 నెలల క్రితమే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. భవేష్ బిండే హోర్డింగ్స్, బ్యానర్లు ఏర్పాటు చేసేందుకు రైల్వేలు, ముంబయి కార్పొరేషన్ నుంచి పలు కాంట్రాక్టులు సంపాదించినట్లు సమాచారం.


మృతుల కుటుంబాలకు పరిహారం


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నగరంలోని అన్ని హోర్డింగ్స్ తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ సహా ముప్పు పొంచి ఉన్న వాటన్నింటినీ తొలగించాలని అధికారులకు స్పష్టం చేశారు.