కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌కు ఓ మెసేజ్ వచ్చింది. పాన్ కార్డు అప్‌డేట్ చేయని కారణంగా బ్యాంక్ అకౌంట్స్‌ బ్లాక్ అయినట్టు ఆ మెసేజ్ సారాంశం. దీన్ని చూసి కంగారు పడిన సదరు ఎంపీ ఆ మెసేజ్‌తోపాటు వచ్చిన లింక్ క్లిక్ చేశారు. పూర్తి వివరాలు అడిగితే అన్నింటినీ ఫిల్ చేశారు. 
లింక్‌లో పూర్తి వివరాలు నింపిన కాసేపటికి ఓ ఫోన్ వచ్చింది. తాము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని వెరిఫికేషన్ కాల్‌ అంటూ పరిచయం చేసుకున్నారు. ఎంపీ కూడా ఓకే ఏం కావాలో చెప్పండి అన్నారు. ఊరుపేరు, పూర్తి పేరు, పుట్టిన తేదీ అన్నింటినీ అడిగి తెలుసుకున్నారా వ్యక్తి. 
తనకు మెసేజ్ వచ్చింది నిజమని... అందులో వివరాలు కూడా నమ్మశక్యంగా ఉన్నాయని భావించి ఫోన్ చేసిన వ్యక్తికి కూడా అన్ని వివరాలు చెప్పేశారు సదరు ఎంపీ. అప్‌డేట్ పూర్తి అవుతుందని.. మాటల్లో పెట్టిన ఫోన్‌లో వ్యక్తి.. చివరకు ఓటీపీని కూడా తెలుసుకున్నాడు. ప్రక్రియ పూర్తైందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. 


ఈ తతంగం జరిగిన కాసేపటికి ఎంపీ సంజీవ్‌ కుమార్‌కు బ్యాంక్‌ నుంచి మెసేజ్ వచ్చింది. ఎంపీ అకౌంట్‌ నుంచి రూ. 48,700 డ్రా అయినట్టు అందులో ఉంది. ఇది ఎలా జరిగింది. ఎవరు తీసి ఉంటారని డైలమాలో ఎంపీ ఉండగానే మరో మెసేజ్ వచ్చింది. ఈసారి రూ. 48,999 తీసినట్టు చూపించింది. ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోయాడాయన. 


వెంటనే బ్యాంక్‌కు వెళ్లి జరిగింది చెబితే... సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ.97,699 ఖాతా నుంచి మాయం చేశారని చెప్పారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మరో దఫా డబ్బులు డ్రా అవ్వకుండా అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తున్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. బ్యాంకు అధికారుల సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంపీ సంజీవ్‌ కుమారు. దీనిపై ఎంక్వయిరీ మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి ఇది ఆపరేట్ చేశారు ఆరా తీస్తున్నారు.