Cyber Crime In Hyderabad: సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. అమాయకులను కొత్త కొత్త మార్గాల్లో మోసం చేస్తున్నారు. లాటరీ తగిందని, లక్కీడిప్ పేరుతో అమాయకుల ఖాతాలను ఖాళీ చేసేవారు. ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ పథకాల వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడ్డారు. తాజాగా కొరియర్ పేరు (Courier Scam)తో సరికొత్త మోసానికి తెరతీశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి (Hyderabad Businessman)ని బెదిరించి ఏకంగా రూ.98 లక్షలు స్వాహా చేశారు. తమ ఖాతాలో పడిన డబ్బును క్షణాల్లో వెంటనే మరో 11 ఖాతాలకు మళ్లించారు. వాటి నుంచి రూ.15 లక్షలు డ్రా చేసుకున్నారు. 


‘సార్ మీకు కొరియర్ వచ్చింది’
వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారికి వారం రోజుల క్రితం ఒక ఫోన్‌ వచ్చింది. తాము కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమని పరిచయం చేసుకున్నారు. మీ పేరుమీద ఫెడ్‌ఎక్స్‌ కొరియర్‌ వచ్చిందని, అందులో మత్తుమందులు ఉన్నాయని భయపెట్టారు. తాము కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు. దీంతో ఏంచేయాలో పాలుపోని వ్యాపారి తనను రక్షించమని వారిని వేడుకున్నారు. అదే అదునుగా సదరు వ్యక్తులు తాము చెప్పిన ఖాతాలో రూ.కోటి జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు. అసలే భయంతో ఉన్న ఆయన వెంటనే రూ.98 లక్షలు బదిలీ చేశారు. కొద్ది సేపటి తరువాత అనుమానం వచ్చి 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అనుభవాన్ని సైబర్ క్రైమ్ అధికారులకు వివరించారు. ట్రాన్సక్షన్ వివరాలను వారికి అందించారు.


రంగంలోకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో
వెంటనే తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగింది. తొలుత బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకుకు అధికారులు ఫోన్‌ చేసి ఆరా తీశారు. డబ్బు కశ్మీర్‌లోని బారాముల్లా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)లో జుజు అనే వ్యక్తి ఖాతాలో జమయ్యాయని చెప్పారు. పీఎన్‌బీకి ఫోన్‌ చేసి వివరాలు సేకరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేర్వేరు రాష్ట్రాల్లోని అయిదు బ్యాంకులకు మళ్లించినట్లు గుర్తించారు. వెంటనే ఆ అయిదు బ్యాంకులకు ఫోన్‌ చేశారు. అక్కడి నుంచి ఆ సొమ్ము మరో ఆరు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. వెంటనే సైబర్ సెక్యూరిటీ అధికారులు ఆ బ్యాంకు అధికారులను సంప్రదించారు.


అవాక్కయిన అధికారులు
జరిగిన మోసాన్ని బ్యాంకు అధికారులకు వివరించారు. ఈ ట్రాన్సక్షన్లపై కేసు నమోదు చేస్తున్నామని, ముందుగా ఆ డబ్బు ఎవరూ డ్రా చేయకుండా నిలిపివేయాలని కోరారు. అయితే అప్పటికే సైబర్‌ నేరగాళ్లు రూ.15 లక్షలు డ్రా చేశారు. మిగతా రూ.83 లక్షలను విత్‌డ్రా చేయకుండా బ్యాంక్ అధికారులు నిలిపివేశారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు సైబర్ నేరగాళ్ల మెరుపు వేగం చూసి అవాక్కయ్యారు. ఇంత వేగంగా స్కాం చేసి డబ్బు ఎలా కాజేస్తున్నారో తెలుసుకుని షాక్ అయ్యారు. కానీ ఎట్టకేలకు అతికష్టం మీద రూ.83 లక్షలు తిరిగి రాబట్టగలిగారు. ఒకటే కేసులో ఇంత భారీ మొత్తంలో రికవరీ చేసి రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రికార్డు సృష్టించారు.