Attack on Crocodile: 


రాడ్‌లతో కొట్టి చంపారు..


బిహార్‌లోని పట్నాలో దారుణం జరిగింది. గంగానదిలోకి దిగిన ఓ 14 ఏళ్ల బాలుడిపై మొసలి దాడి చేసి మింగేసింది. కొత్త బైక్‌ కొనుక్కున్న ఆ బాలుడు పూజ చేయించేందుకు గుడికి వచ్చాడు. గంగాజలంతో బైక్‌ని శుద్ధి చేయాలని అనుకున్నాడు. నదిలోకి దిగి నీళ్లు తీస్తూ ఉండగా ఉన్నట్టుండి మొసలి దాడి చేసి మింగింది. దాడి చేయడాన్ని చూసిన తల్లిదండ్రులు కొడుకుని కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ...కుదరలేదు. పళ్లతో గట్టిగా కరుచుకున్న మొసలి...బాలుడిని తినే వరకూ ఊరుకోలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జనం వెంటనే వల తీసుకొచ్చి మొసలిపై వేశారు. అది చిక్కుకునేంత వరకూ అక్కడే ఉన్నారు. వలలో చిక్కుకున్న మరుక్షణమే బయటకు లాగేశారు. కర్రలతో దాడి చేయడం మొదలు పెట్టారు. కొందరు రాడ్‌లతోనూ దారుణంగా కొట్టారు. ఇంకొందరు తమ చెప్పులు విసిరారు. చనిపోయింది అని నిర్ధరించుకునేంత వరకూ కొట్టడం ఆపలేదు. చనిపోయిన మొసలిని పక్కకు పడేసిన స్థానికులు ఆ బాలుడి శరీర భాగాలను నీళ్లలో నుంచి తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే..ఈ ఘటనపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా దాడి చేయడమేంటని ప్రశ్నించారు. శాంతిభద్రతలు కాపాడేందుకు అందరూ సహకరించాలని కోరారు. అనవసరపు ఆవేశాలతో మూగ జీవాల ప్రాణాలు తీయొద్దని హెచ్చరించారు. అధికారులకు చెబితే చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తారని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. మొసలిని చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. 


గతంలోనూ...


మొసలి ఓ పిల్లాడిని మింగేసిందన్న కోపంతో మొసలిని 7 గంటల పాటు బంధించారు గ్రామస్థులు. మధ్యప్రదేశ్‌లోని రఘునాథ్‌పూర్ గ్రామ ప్రజలు చేసిన ఈ పనికి అటవీ అధికారులు షాక్ అయ్యారు. గతేడాది జులైలో జరిగిందీ ఘటన. మొసలి కాళ్లను కట్టేసి, నోరు మూసివేసే వీల్లేకుండా అలాగే 7 గంటల పాటు ఉంచారు. మొసలి కడుపులో ఉన్న బాలుడు బయటకి వస్తాడన్న నమ్మకంతో, అన్ని గంటల పాటు మొసలి నోరు మూయకుండా కట్టడి చేశారు. చంబల్‌ నదిలోకి స్నానం చేసేందుకు బాలుడు దిగాడని, ఆ సమయంలో మొసలి మింగేసిందని గ్రామస్థులు వాదిస్తున్నారు. మరో విచిత్రం ఏంటంటే మొసలి కడుపులో ఆ బాలుడు బతికే ఉన్నాడని ఫిక్స్ అయ్యారు అంతా. ఆ బాలుడి పేరు పిలుస్తూ, బదులు కోసం ఎదురు చూశారట. అప్పటికే అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు గ్రామస్థలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. "మీరు అనుకున్నది సాధ్యం కాదు" అని వివరించారు. "నదీ తీరంలో బాలుడు స్నానం చేస్తున్నాడు. ఉన్నట్టుండి మొసలి దాడి చేసింది. మొసలికి చిక్కకుండా ఉండేందుకు చాలా వేగంగా ఈదాడు. అయినా మొసలి బాలుడిని పట్టుకుంది.  ఆ సమయంలో పిల్లాడు గట్టిగా అరిచాడు. వెంటనే మేమంతా ఇక్కడికి వచ్చాం" అని  వివరించారు స్థానికులు. వలల సాయంతో మొసలిని పట్టుకున్నారు. గ్రామస్థులకు నచ్చచెప్పి మొసలిని నీళ్లలో వదిలే సరికి, అధికారుల తలప్రాణం తోకకు వచ్చింది. అయితే మరుసటి రోజు ఆ బాలుడి మృతదేహం నదిలో కనిపించింది.


Also Read: మీటింగ్‌కి షర్ట్ లేకుండా వచ్చి షాక్ ఇచ్చిన ఆఫీసర్, సస్పెండ్ చేసిన అధికారులు