Andhra Pradesh Crime News: కొరియర్ సంస్థలు ద్వారా జరుగుతున్న మోసాలు ఈ మధ్య కాలంలో భాగా పెరిగిపోయాయి. ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా కొరియర్(Courier) సంస్థలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ సంస్థల్లో పనిచేస్తున్న కొందరి సిబ్బంది కారణంగా  సంస్థకే చెడ్డపేరు వస్తోంది. విలువైన వస్తువులను మాయం చేసి వాటి స్థానంలో రాళ్లు, ఇటుకలు పెట్టి కస్టమర్లకు అందిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.


ల్యాప్‌టాప్‌కు బదులు బండరాయి
ల్యాప్‌టాప్‌(Laptop) కోసం కొరియర్ కవర్‌ విప్పి చూస్తే...బండరాయి కనిపించడంతో సమగ్ర శిక్షణ కార్యాలయం సిబ్బంది విస్తుపోయారు. రాష్ట్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల సమగ్ర శిక్షణ డీసీపీ(DCP), ఏపీసీ(APC)లకు కొరియర్‌లో ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ఇండియా అనే కంప్యూటర్ సంస్థ ఈ ల్యాప్‌టాప్‌లను కొరియర్ ద్వారా పంపింది. అయితే అనతంపురం డీసీపీగా ఉన్న డీఈవో సహా మిగిలిన వారికి  మే 31న  ల్యాప్‌టాప్‌లు కొరియర్ ద్వారా వచ్చాయి. డీఈవో(DEO)  కొరియర్ కవర్ తెరిచి చూడగా ల్యాప్‌టాప్ ఉంది. అయితే ఏపీసీకి వచ్చిన ల్యాప్‌టాప్(Laptop) కవరు ఓపెన్ చేయలేదు. ఈ క్రమంలో రాష్ట్ర సమగ్ర శిక్షణ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. జిల్లాకు పంపిన రెండు ల్యాప్‌టాప్‌ల్లో ఒకటి అందుకున్నారని సమాచారం వచ్చిందని... రెండోదాని సంగతి ఏంటని ప్రశ్నించారు. దీంతో ఏపీసీ(APC) పార్శిల్ ఓపెన్ చేసి చూడగా అందులో బండరాయి దర్శనమివ్వడంతో ఆయన అవాక్కయ్యారు. 


విలువైన ల్యాప్‌టాప్ మాయం
హెచ్‌పీ కంపెనీకి చెందిన 12 జనరేషన్, 16 జీబీ ర్యామ్, 1టీబీ ఎస్‌ఎస్‌డీ, స్క్రీన్‌ విండోస్‌ 11 ప్రో, ఎంఎస్‌ ఆఫీస్‌ అడాప్టర్‌ క్యారీ కేస్‌ సామర్థ్యం కల్గిన అత్యంత ఖరీదైన ల్యాప్‌టాప్‌లను సమగ్ర శిక్షణ సంస్థ కొనుగోలు చేసింది. వీటిని అన్ని జిల్లాలకు కొరియర్ ద్వారా పంపిణీ చేసింది. కానీ అనంతపురం(Anathapuram) ఏపీసీకి పంపించిన కొరియర్‌లో బండరాయి రావడంతో ఆయన ఆశ్చర్యపోయారు. పైగా ఆ రాయికే కవర్లు కప్పి ఉంచడంతోపాటు ల్యాప్‌టాప్ ఎంత బరువు  అయితే ఉంటుందో అంతే బరువు ఉన్న రాయిని ఉంచారు.  అయితే, ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర కార్యాలయ అధికారుల దృష్టికి స్థానిక సిబ్బంది తీసుకెళ్లారు. ల్యాప్‌టాప్‌(Laptop) పార్శిల్‌ కవరుపై ఉన్న కంప్యూటర్‌ ఇండియా సంస్థ ఫోన్‌ నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


మోసం ఎక్కడ జరిగింది
అయితే ల్యాప్‌టాప్ ఎక్కడ మాయమైందో తెలియడం లేదు. ఇండియా సంస్థలోని సిబ్బందే చేతివాటం ప్రదర్శించి రాయిని కవర్‌లో పెట్టి పంపారా.? లేక కొరియర్ సంస్థలో చేతులు మారిందా లేక కొరియర్ సిబ్బంది ల్యాప్‌టాప్ దొంగిలించి అందులో రాయినిపెట్టరా తేలాల్సి ఉంది. ఇటీవల చాలాచోట్ల కొరియర్ బాయ్స్‌ చేతివాటం ప్రదర్శిస్తూ...విలువైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు మాయం చేస్తూ...వాటిస్థానంలో రాళ్లు, ఇటుకలు పెట్టి ఇస్తున్నారు. ఇది కూడా అదే విధంగా చోటుచేసుకుని ఉంటుందని సిబ్బంది అనుమానిస్తున్నారు. అయితే విలువైన వస్తువులు పార్శిల్ ద్వారా వచ్చినప్పుడు వారి ముందే ఆ పార్శిల్ ఓపెన్ చేసుకుని వస్తువులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పదేపదే అవగాహన కల్పిస్తున్నా....సమగ్ర శిక్షణ సంస్థ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఈ తప్పిదం జరిగింది.