Crime News: భార్య మరో వ్యక్తితో సహజీవనం చేయడాన్ని జీర్ణించుకోలేక పోయాడు భర్త. ఈ క్రమంలోనే పలుమార్లు హత్య చేస్తానంటూ బెదిరించాడు. చాలా సార్లు ఆమెతో గొడవ కూడా పడ్డాడు. అయినా ఆమె అవేమీ పట్టించుకోకుండా అతడితో హాయిగా జీవనం సాగిస్తుంది. అయితే బతుకమ్మ పండుగ సందర్భంగా రాత్రి ఆమె ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే రాడ్డు పట్టుకొని వచ్చిన అతడు.. బతుకమ్మ ఆడుతున్న భార్య తలపై గట్టిగా కొట్టాడు. దీంతో తలపై తీవ్ర గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ అమానుష ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. 


ఎన్నో ఏళ్ల నుంచి మరో వ్యక్తితో సహజీవనం..


సిద్దిపేట జిల్లా వీరాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా... పెద్ద కూతురు మంగను స్థానికుడు అయిన యాళ్ల ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి జరిగిన నెల రోజులకే మంగ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయింది. దీంతో తమ రెండో కమార్తె స్వప్నను ఇచ్చి పెళ్లి జరిపించారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు (కుమార్తె, కుమారుడు) కూడా పుట్టారు. అయితే ఆరేళ్ల పాటు హాయిగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. రోజురోజుకీ భార్యాభర్తల మధ్య గడవలు ఎక్కువ అవడంతో భర్తకు దూరంగా వచ్చి ఉంటోంది. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీయడంతో.. అతడితో కలిసి 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది.


బతుకమ్మ ఆడుకుంటుండగా వచ్చి హత్య..


అయితే తనతో విడిపోయిన భార్య మరో వ్యక్తితో సహజీవనం చేయడం, జీవితాన్ని హాయిగా గడపడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే చాలా సార్లు ఆమెను చంపేస్తానంటూ బెదిరించాడు. గొడవలకు కూడా దిగాడు. అయితే బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ ఆడుకుంటున్నారు. స్వప్న కూడా వెళ్లి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుకుంటోంది. విషయం గుర్తించిన భర్త ఎల్లారెడ్డి.. ఆమెను అంతమొందించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెళ్లి ఇనుప రాడ్డు తీసుకొని వచ్చి ఆమె తలపై గట్టిగా బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


భార్యపై అనుమానంతో హత్య..!


ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య అందంగా ఉండడంతో అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు కాలనీలో ఉంటున్న మాలపల్లికి చెందిన అనీస్‌ ఫాతిమా (30)ను ఆమె భర్త సయ్యద్‌ సుల్తాన్‌ చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. భర్త అనుమానంతో వేధించడంతో ఆమె ఏడాదిన్నరగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు ఫాతిమా. పిల్లలను చూసే నెపంతో ఫాతిమా ఉంటున్న ఇంటికి సయ్యద్‌ సుల్తాన్‌ వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆమె ఇంటికి వచ్చిన సయ్యద్ భార్యతో గొడవపడి హత్య చేశాడు. ఆ తర్వాత పిల్లలను తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫాతిమా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కేసు పెట్టకపోతే పిల్లలను ఇస్తానని చెప్పాడు. దీంతో ఫాతిమా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.