వివాహేతర సంబంధాలు ఎంతటి ఘోరానికైనా ఒడిగట్టేలా చేస్తున్నాయి. నమ్మివచ్చిన వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, ప్రియురాలు కలిసి కొట్టి చంపి వర్మి కంపోస్ట్ యార్డులో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం భార్యతో కలిసి తన కుమారుడు ఆంధ్రప్రదేశ్‌లోని గంగలకుర్రు అగ్రహారం వెళ్లిన కనిపించడం లేదంటూ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో శివాజీ అనే వ్యక్తి చెందిన అక్కిడి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట గంగలకుర్రు అగ్రహారానికి చెందిన రాయుడు రవిశంకర్ తల్లి గతంలో అదిలాబాద్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. ఆ సమయంలో ఆప్రాంతానికి చెందిన గజానంద్ బోడ్కర్ అనే వ్యక్తి ఆమె కారు డ్రైవరుగా పనిచేసేవాడు. ఆసమయంలో తన తల్లి ద్వారా గజానంద్ రవిశంకర్‌కు పరిచయం అయ్యాడు. కరోనాకు ముందు ఆదిలాబాద్‌లో మసాలా దినుసులు వ్యాపారం చేసిన రవిశంకర్ వ్యాపారంలో నష్టాలు రావడంతో స్వగ్రామం గంగలకుర్రు వచ్చేశాడు. ఇక్కడ వర్మి కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాడు.
తనకు సహాయంగా పనిచేసేందుకు తీసుకువచ్చి..
స్వగ్రామంలో వర్మి కంపోస్ట్ యూనిట్‌లో తనకు సహాయం చేసేందుకు తన తల్లి కారుడ్రైవరుగా పనిచేసిన గజానంద్ బోడ్కర్‌ను, అతని భార్య ఊర్మిళ ను అదిలాబాద్‌నుంచి రప్పించి అమలాపురం మండలంలోని బండార్లంక మెట్ల కాలనీలో నివాసం ఏర్పాటు చేశాడు రవిశంకర్. ఈ క్రమంలోనే గజానంద్ భార్య ఊర్మిళతో శారీరక సంబంధం పెట్టుకున్న రవిశంకర్ వర్మి కంపోస్టు నష్టాలు రావడంతో అది మూసివేసి రాయల్ ఎన్‌ఫీల్డ్ విడిభాగాల షాపు పెట్టుకున్నాడు. వీరి మధ్య జరుగుతోన్న వివాహేతర సంబంధానికి భర్త గజానంద్ అడ్డువస్తున్నాడని ఓ ప్లాన్ వేశారు.
ప్రియుడు, భార్య కలిసి హత్యచేసి..
గత ఏడాది నవంబర్ 23న రవిశంకర్ గతంలో నిర్వహించిన వర్మికంపోస్ట్ యూనిట్ వద్దకు గజానంద్ బోడ్కర్‌ను, అతని భార్య ఊర్మిళను రప్పించాడు రవిశంకర్. అక్కడ పథకం ప్రకారం రవిశంకర్, ఊర్మిళ ఇద్దరూ కలిసి గజానంద్‌ను కొట్టి చంపారు. మృతదేహాన్ని అక్కడే వర్మి కంపోస్ట్‌లో పూడ్చిపెట్టారు. యధావిధిగా ఇక్కడ గజానంద్ భార్య ఊర్మిళ ఉంటోంది. అయితే గజానంద్‌నుంచి ఎటువంటి సమాచారం కానీ, ఫోన్ మాట్లాడకపోవడం కానీ లేకపోవడంతో అనుమానం వచ్చిన అతని తండ్రి శివాజీ హైదరాబాద్‌లోని ఆఫ్జల్‌గంజ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అక్కడి నుంచి పోలీసు బృందం ఇక్కడివచ్చి దర్యాప్తు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో వారు అంబాజీపేట పోలీసులకు కేసును బదిలీ చేశారు.
జిల్లా ఎస్పీ శ్రీధర్ ఈ కేసును దర్యాప్తు చేయాలని కొత్తపేట డీఎస్పీకె.వెంకటరమణ పర్యవేక్షణలో పి.గన్నవరం సీఐ ప్రశాంత్‌కుమార్‌కు అప్పగించారు. స్థానిక ఎస్సై చైతన్యకుమార్‌తో కలిసి సీఐ ప్రశాంత్‌కుమార్ దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో గజానంద్‌బోడ్కర్‌ను అతని భార్య ఊర్మిళ, ప్రియుడు రవిశంకర్‌లు కలిసి హత్యచేశారని, మృతదేహాన్ని కంపోస్ట్ యూనిట్‌లో పాతిపెట్టారని గుర్తించి వెలికి తీయించారు. గజానంద్ అస్తిపంజరం లభ్యమైంది. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నాలుగు రోజుల్లో కేసును ఛేధించిన సీఐ ప్రశాంత్ కుమార్‌ను, ఎస్సై చైతన్యకుమార్‌ను ఎస్పీ అభినందించారు.