CPI Leader Killed: కేరళలో CPI(M) నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొజికోడ్ జిల్లాలోని కొయిలాండి ప్రాంతంలో ఈ హత్య జరిగింది. టౌన్ సెంట్రల్ లోకల్ కమిటీ సెక్రటరీగా ఉన్న 62 ఏళ్ల పీవీ సత్యనాథన్‌ని (PV Sathyanathan Death) ఫిబ్రవరి 22వ తేదీన రాత్రి 10 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. పెరివట్టూర్ ఆలయం వద్ద వేడుకలు జరుగుతుండగా ఉన్నట్టుండి దాడి చేశారు. ఈ హత్య కేసులో CPI(M) మాజీ సభ్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడిలో సత్యనాథన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. మెడపై లోతైన గాయం అవడం వల్ల వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ హత్యను నిరసిస్తూ CPI(M) పార్టీ బంద్ స్థానికంగా బంద్ ప్రకటించింది. అయితే...ఈ హత్య రాజకీయ కుట్ర లేదా ఏదైనా వ్యక్తిగత కక్షలా అన్నది ఇంకా పోలీసులు తేల్చలేదు. విచారణ పూర్తైన తరవాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అటు పలక్కడ్ జిల్లాలోనూ లోకల్ లీడర్‌ని హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇలా వరుస హత్యలతో అందరిలోనూ ఆందోళన పెరిగింది. ఈ ఘటనలకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.