Bhadrachalam Constable Suicide News | భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ భద్రాచలం బ్రిడ్జి పైనుండి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కానిస్టేబుల్ డెడ్ బాడీ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నానని తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల వరదల్లో తన తండ్రితో పాటు ఇల్లు, ఆస్తిని కోల్పోయానంటూ కానిస్టేబుల్ రమణారెడ్డి చనిపోయేముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపాడు. తనకు కార్ యాక్సిడెంట్ జరిగిందని, అప్పటినుంచి రాత్రిళ్లు అసలు నిద్ర కూడా పట్టడం లేదన్నాడు. శుక్రవారం ఉదయం దాదాపు పదకొండున్నర గంటలకు నుండి బ్రిడ్జి మూడవ స్తంభం వద్ద ఓ వ్యక్తి తన మొబైల్, చెప్పులు వదిలిపెట్టి భద్రాచలం బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలోకి దూకాడని ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ పిసి 597 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్లూస్ టీంలో పనిచేస్తున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది.


కానిస్టేబుల్ రమణారెడ్డి సెల్ఫీ సూసైడ్ వీడియోలో ఏం చెప్పారంటే..
‘ ఈ యాక్సిడెంట్ వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను. గత 15 రోజుల నుంచి ఈరోజు వరకు ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. మా కుటుంబం ఏదో విష వలయం చిమ్మినట్లు అనిపిస్తోంది. నేను జీవితాన్ని ఇంతకంటే ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాను. దయచేసి నా కుటుంబసభ్యులు అందరూ నన్ను క్షమించండి. నాని, శ్రీలత, శ్రీధర్, రాజ్యలక్ష్మీ.. దయచేసి అంతా నన్ను క్షమించండి (అంటూ కన్నీళ్లు). అదేంటోగానీ నా కుటుంబానికి వరుస సమస్యలు, కష్టాలొస్తున్నాయి. 
మంచి భార్యను ఇచ్చిన దేవుడు 40 ఏళ్లకే ఆమెకు అనారోగ్య సమస్యలు ఇచ్చాడు. అనుకోకుండా ఎందుకు కార్ యాక్సిడెంట్ జరిగిందో కానీ, అప్పటినుంచి నాకు నిద్ర పట్టడం లేదు. ఒకటే భయం భయం. జీవితం ఏమైతుందో తెలియడం లేదు. టెన్షన్ వల్ల జీవితం నరకంగా అనిపిస్తుంది. నాకున్న అన్నింటికన్నా దరిద్రమైన అలవాటు గుడ్డిగా నమ్మటమే. ఈ మధ్య వర్షానికి మా నాన్న జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు కొనుక్కున్న ఇళ్లు వరదలకు మునిగిపోయింది. ఈ మానసిక ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి’ అని కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో రూపంలో తన ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ రమణారెడ్డి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని భద్రాచలం ఎస్సై తెలిపారు. 


Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ప్రాణాలు తీసిందా? సంచలనంగా మారుతున్న యువకుడి మృతి!