Meerpet Murder Case Investigation: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన మీర్ పేట్ వివాహిత హత్య (Meerpet Murder Case) కేసులో రోజుకో విస్మయకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి పని చేసే చోట, స్థానికంగా అతని స్వభావం.. హత్య జరిగిన రోజు పరిణామాల గురించి పోలీసులు విచారించినప్పుడు ఆసక్తికర విషయాలు తెలిశాయి. నిందితుడు డీఆర్డీవోలో కాంట్రాక్ట్ విధానంలో భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడ విచారించారు. అతనిది మెతక స్వభావం అని.. సహోద్యోగులతో చక్కగా ప్రవర్తిస్తాడని సహోద్యోగులు తెలిపారు. 'విధుల్లోనూ క్రమశిక్షణతో ఉంటాడు. ఎవరు సాయం అడిగినా కాదనకుండా చేస్తాడు. అలాంటి వ్యక్తి ఇంత దారుణంగా, రాక్షసంగా ఎలా ప్రవర్తించాడో ఎవరికీ అంతుబట్టడం లేదు.' అని కొందరు సహోద్యోగులు తెలిపారు. ఇటీవల తెలిసిన వ్యక్తికి ఉద్యోగంలో పెట్టించినట్లు మరో ఉద్యోగి చెప్పారు. గురుమూర్తి ప్లాస్టిక్ వస్తువులు వాడేందుకు ఇష్టపడడని.. ఛాయ్ తాగేందుకు, భోజనం తెచ్చే క్యారేజీ కోసం కూడా ప్లాస్టిక్ ఉపయోగించడని ఓ సహోద్యోగి పోలీసులకు వివరించారు.


పొరుగింటి వ్యక్తి దుర్వాసన పసిగట్టినా..


అటు, గురుమూర్తి ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని స్థానికులు పోలీసులకు తెలిపారు. హత్య జరిగిన రోజు (ఈ నెల 15న) ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ఇరుగుపొరుగు నుంచి వివరాలు సేకరించారు. సంక్రాంతి పండుగ మరుసటి రోజు కావడంతో కొందరు సొంతూళ్లు వెళ్లారు. అదే అంతస్తులో ఉండే ఓ వ్యక్తి 15వ తేదీ ఉదయం బయటకు వెళ్లి ఇంటికొచ్చాడు. అప్పటికే గురుమార్తి తన భార్యను చంపి ఇంట్లో ఉన్నాడు. భార్య మృతదేహాన్ని ఉడికించాడు. పొరుగు వ్యక్తి ఇంట్లోకి తిరిగి వెళ్లే సమయంలో దుర్వాసన ఎక్కువగా రావడాన్ని పసిగట్టాడు. అనుమానాస్పదంగా అనిపించినా.. పండుగ టైం ఎవరో మాంసం వండి వండుకుంటున్నారనే పెద్దగా పట్టించుకోలేదు. అనంతరం భార్యను హత్య చేసి మృతదేహాన్ని కాల్చేశాడనే విషయం తెలుసుకుని వణికిపోయాడు. అదే రోజు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. 


అసలేం జరిగిందంటే..?


ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేశాడు. ఈ నెల 18న మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తే హంతకుడని తేల్చారు. వీరు రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పీఎస్ పరిధిలోని బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సంక్రాంతి రోజున భార్యను హత్య చేసిన అనంతరం మటన్ నరికే కత్తితో మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను పాశవికంగా హీటర్ సాయంతో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో ఉడికించాడు. ఎముకలను పొడి చేసి తర్వాత దాన్ని బాత్రూం ప్లస్ ద్వారా డ్రైనేజీలోకి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. 


అరుదైన కేసు


నిందితుడు గురుమూర్తి 'సూక్ష్మదర్శిని' అనే వెబ్ సిరీస్ చూసి భార్య మృతదేహాన్ని మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది అరుదైన కేసుగా చెప్పారు. ఆధారాలు సేకరించేందుకు అత్యాధునికి టెక్నాలజీ వాడినట్లు తెలిసింది. వివాహేతర సబంధమే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆనవాళ్లు దొరకవని పోలీసులకే సవాల్ విసిరిన నిందితుడిని వారం రోజుల పాటు శ్రమించి పక్కా ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు.


Also Read: Crime News: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాలు - రోడ్డు ప్రమాదాల్లో నలుగురు, గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి