CID launches probe into Rs 100 crore bank fraud in Andhra Pradesh : నర్సరావుపేట, చిలుకలూరిపేట బ్రాంచుల్లో జరిగిన ఖాతాదారుల నగదు, బంగారం గోల్ మాల్ చిన్నది కాదని కనీసం వంద కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు నిందితుడిగా అప్రైజర్‌తో పాటు మరో ఉద్యోగి నరేష్ ను గుర్తించారు. అయితే ఇలా గోల్ మాల్ చేయడం ఒకరిద్దరితో అయ్యే పని కాదన్న ఉద్దేశంతో సీఐడీ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నరేష్ పోలీసులకు లొంగిపోకుండా పరారీలో ఉన్నారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో తనతో పాటు చాలా మందికి ఈ విషయాలు తెలుసని కానీ తనను మాత్రమే బలి పశువును చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
ఎక్కడ పని చేస్తే అక్కడ గోల్ మాల్ చేసిన నరేష్
మొదట చిలుకలూరిపేట బ్రాంచ్‌లో పని చేసినప్పుడు బ్రాంచ్ వ్యాపారం పెంచేందుకని చెప్పి ఖాతాదారుల ఇళ్లకు వెళ్లి మరీ ఫిక్స్ డ్ డిపాజిట్లుగా బంగారం, నగదు డిపాజిట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. బ్యాంకు సాధారణంగా ఆఫర్ చేసే వడ్డీ కన్నా ఎక్కువ ఆఫర్ చేశారు. అయితే బ్యాంకే ఆఫర్ ఇస్తున్నట్లుగా నమ్మించారు. వారి వద్ద నుంచి బంగారం, నగదు తీసుకుని బ్యాంకు ఇచ్చినట్లుగానే ఫిక్సుడ్ డిపాజిట్ పత్రాలు ఇచ్చారు. వడ్డీని ఠంచన్‌గా జమ చేయడం ప్రారంభించారు. అయితే ఖాతాదారులు వడ్డీ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోలేదు. అది బయట ఖాతాల నుంచి ఎందుకు జమ అవుతుందో అంచనా వేయలేకపోయారు.
ఫేక్ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
నర్సరావుపేటలోనూ అదే పని
నర్సరావుపేటకు బదిలీ అయిన తర్వాత అక్కడ కూడా నరేష్ అదే పని చేశాడు. వారు డబ్బులు బ్యాంకులో జమ చేసినట్లుగా నమ్మించి సొంతానికి వాడుకుని వారికి ప్రైవేటు ఖాతాల నుంచి వడ్డీ జమ చేస్తూ వస్తున్నారు. గత రెండు నెలల నుంచి వడ్డీ జమ కాకపోతూండటంతో వారంతా బ్రాంచులకు వెళ్లి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. బ్యాంకు పై నమ్మకం పోకుండా ఉండాలంటే.. తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో సీఐడీని ప్రభుత్వం రంగంలోకి దించింది. సీఐడీ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు.
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
వేరే ఖాతాల నుంచి వడ్డీ జమ అయినా గుర్తించలేకపోయిన ఖాతాదారులు
అప్రైజర్ ఆత్మహత్యాయత్నం చేసి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేష్ పరారీలో ఉన్నాడు. నరేష్ దొరికితే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు చిలుకలూరిపేట, నర్సరావుపేటతో పాటు నిందితుడు ప్రస్తుతం పని చేస్తున్న విజయవాడ భారతి నగర్ ఐసీఐసీఐ బ్యాంకులోనూ దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలుసుకుంటున్నారు. ఖాతాదారుల నగదు, బంగారం నష్టపోకుండా తిరిగి వచ్చేలా చేసేందుకు సీఐడీ అధికారులు ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. నరేష్ దొరికితే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.