తిరుపతి: ప్రేమ పేరుతో నమ్మించి, యవతిని రెండు సార్లు గర్భవతిని చేశాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడిగితే నువ్వు ఎవరో తెలియదు అంటూ కట్టుకథ చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే గ్రామస్తులు కఠినంగా ప్రవర్తించారు.


తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే వ్యామోహంలో పడి యువతి యువకులు అనే వ్యత్యాసం లేకుండా మోసపోతున్నారు. చదువుకునే వయస్సులో ప్రేమ, పెళ్ళి అంటూ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా కన్నవారి పరువును తీస్తున్నారు. రేయింబవళ్లు కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల కలలను కలలుగానే మిగిల్చుతున్నారు కొందరు యువత. తాజాగా ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేయడంతో ఓ యువతికి పోలీసులను ఆశ్రయించింది. కానీ పోలీసులు న్యాయం చేయక పోగా, ఆ యువతిని బెదిరించి ఇంటికి పంపించివేశారు. చేసేదేమీ లేక బాధిత యువతి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.


వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని ఎం.కొత్తూరు గ్రామానికి చెందిన యువతి (21), అదే గ్రామానికి చెందిన జనార్ధన్ అనే యువకుడిని ప్రేమించింది. ప్రేమ పేరుతో నమ్మించిన జనార్ధన్ సంవత్సరం పాటు అమ్మాయితో శారీరక సంబంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో యువతి గర్భవతి అయ్యింది. ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించాడు ఆమె ప్రియుడు. తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ మరోసారి యువతిని గర్భవతిని చేశాడు. దీంతో ఆ యువతి జనార్ధన్ ను గట్టిగా నిలదీసింది. మాయమాటలు చెప్పిన నిందితుడు మరోసారి అబార్షన్ చేయించాడు.


పెళ్లి చేసుకుంటానని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్తూ, నమ్మిస్తూ వచ్చిన జనార్ధన్, ఒక్కసారిగా ప్రియురాలికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఫోన్ కూడా లిప్ట్ చేసేవాడు కాదు. ఎదురుగా కనిపించినా మాట్లాడేవాడు కాదు. దీంతో యువతి ఓ రోజు గ్రామంలోని రచ్చబండ వద్ద ఉన్న జనార్ధన్ ను పెళ్లి గురించి నిలదీసింది. నువ్వు ఎవరో నాకు తెలియదని జనార్ధన్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అతి తెలివి ప్రదర్శించి ప్రియురాలి మొబైల్ లోని ఫొటోలను డిలీట్ చేశాడు. 


జనార్ధన్ పై ఆగ్రహించిన ప్రియురాలు తన తల్లికి విషయం చెప్పి గ్రామంలో పంచాయితీ పెట్టింది. కానీ యువతి పేదింటి అమ్మాయి కావడంతో ఎవరూ అండగా నిలవలేదు. గ్రామస్తులు అంతా జనార్ధన్ కే సపోర్ట్ చేసారు. తనను మోసం చేయవద్దంటూ పంచాయితీలోనే యువతి తన ప్రియుడు జనార్థన్ కాళ్లు పట్టుకుని వేడుకుంది. యువతి తల్లి సైతం జనార్ధన్ కాళ్ళు పట్టుకుని వేడుకున్నారు. కానీ కనికరించని జనార్ధన్ విషయం వేరే ఊరి వాళ్లకు, బయటకు వెళ్తే ఊరి నుండి వెలివేస్తాం అంటూ వార్నింగ్ ఇప్పించాడు. 


గ్రామం రచ్చబండలో తనకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో యువతి కొన్నిరోజుల కిందట బైరెడ్డిపల్లి పోలీసులను ఆశ్రయించి, జనార్ధన్ పై ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ ఇచ్చి దాదాపు పది రోజులు గడుస్తున్నా, ఇంత వరకూ జనార్ధన్ ను స్టేషన్ కి పిలిచి విచారణ చేయలేదని, తనకు న్యాయ చేయలేదంటూ భాధితురాలు వాపోయింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లినందుకు గ్రామంలో పెద్ద మనుషులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, కొందరు గ్రామస్తులు తన కుటుంబంపై దౌర్జన్యం చేస్తున్నారని చెప్పింది. తనకు జనార్దన్‌తో పెళ్లి జరగకపోతే  ఆత్మహత్యే శరణ్యమని, పోలీసులు ఇప్పటికైనా కేసు నమోదు చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతోంది.