Chittoor Crime : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో బ్యాంకులో చోరీకి యత్నించిన ఎనిమిది మంది యువకులు కటకటాల పాలయ్యారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం విజలాపురంలో గత నెల 28వ తేదీన సప్తగిరి గ్రామీణ బ్యాంకులో చోరీ యత్నం జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంకులో దొంగతనం చేసేందుకు వినియోగించిన రెండు కార్లు, గ్యాస్ కట్టర్, ఆక్సిజన్ సిలిండర్ ను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ దొంగతనానికి పాల్పడిన నిందుతులను చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియా ముందు హాజరు పరిచారు. 


అసలేం జరిగింది? 


చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం విజలాపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గత నెల 28వ తేదీ రాత్రి దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే సైరన్  మోగడంతో పరారీ అయ్యారు. ఈ కేసులో దొంగలను పట్టుకునేందుకు పలమనేరు డీఎస్పీ గంగయ్య పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రామకుప్పం ఎస్ఐ ఉమామహేశ్వర్ రెడ్డి, రాళ్ళబుదుగురు ఎస్ఐ మునిస్వామి, గంగవరం ఎస్సై సుధాకర్ రెడ్డి, గుడుపల్లి ఎస్ఐ రామాంజనేయులు సిబ్బందితో కలిసి శాంతిపురం మండలం నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలను చెక్ చేస్తుండగా రెండు కార్లలో వస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు.



(ఎస్పీ రిశాంత్ రెడ్డి)


క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకోవడంతో


పోలీసులను చూసిన యువకులు పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని వెంబడి పట్టుకున్న పోలీసులు విచారణలో బ్యాంక్ దొంగతనం విషయం బయటకువచ్చింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి రెండు కార్లు, గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్ , ఆక్సిజన్ సిలిండర్ ను స్వాధీనం చేసుకుని దొంగలను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో ఉన్న నిందితులు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనాలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లలో డబ్బులు పోగొట్టుకోవడంతో యూట్యూబ్ లో వచ్చే బ్యాంకు దొంగతనాలు వీడియోలు చూసి ఆ తరహాలో దొంగతనం చేసేందుకు పథకం చేశారని ఎస్పీ రిశాంత్ రెడ్డి అన్నారు. 


Also Read : Parvatipuram Crime News : ప్రాణానికి ప్రాణం తీర్పు చెప్పిన పంచాయతీ పెద్దలు, మతిస్థిమితం లేని వ్యక్తి దారుణ హత్య