Chittoor News : యువకులు మత్తు పదార్థాలకు బానిసగా మారి‌ నిండు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. కొందరు యువకులను డ్రగ్స్ కు బానిసలుగా చేస్తూ చిత్తూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున MDMA [Methamphetamine] అనే డ్రగ్స్ అమ్ముతున్న ముఠాకు చెందిన సూడాన్ దేశస్తుడితో పాటుగా మరో ఐదు మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు‌ లక్షల రూపాయల విలువ గల 34 గ్రాముల డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  


ఆరుగురి అరెస్ట్ 


చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం... చిత్తూరు పట్టణంలోని యువత డ్రగ్స్ కి బానిసగా మారుతున్నారని వచ్చిన సమాచారంతో డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను పట్టుకున్నామని ఎస్పీ వెల్లడించారు. ఆదివారం చిత్తూరు టౌన్ పరిధిలోని ఇరువారం జంక్షన్ సమీపంలో  బాల త్రిపుర సుందరి దేవస్థానం వద్ద కొందరు వ్యక్తులు డ్రగ్స్ అమ్ముతున్నారని వచ్చిన సమాచారంతో చిత్తూరు టు టౌన్ ఇన్స్పెక్టర్  సిబ్బందితో, తహసీల్దార్ తో సహా ఘటనా స్థలానికి చేరుకుని డ్రగ్స్ అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు పరారయ్యారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుంచి దాదాపు రెండు లక్షల రూపాయల విలువ చేసే సుమారు 34 గ్రాముల MDMA [Methamphetamine] అనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. 



డ్రగ్స్ బిజినెస్ ఎలా? 


చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం అరగొండకు చెందిన సిరాజ్ అనే వ్యక్తి ఉద్యోగరిత్యా బెంగళూరులో పనిచేస్తున్నాడు. సిరాజ్ సూడాన్ దేశానికి చెందిన అహ్మద్ ఒమర్ అహ్మద్ సయీద్ అలియాస్ షాలూఫా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనికి డ్రగ్స్ వాడే అలవాటు ఉండడంతో, అహ్మద్ ఒమర్ వద్ది నుంచి సిరాజ్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు.  తర్వతా MDMA డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టాడు.  చిత్తూరుకు చెందిన సురేష్, ప్రతాప్, తేజ కుమార్, వెంకటేష్ అలియాస్ వెంకీ మార్లీ, జయశంకర్, మోహన్ అలియాస్ సంతోష్, మురళీలతో పరిచయాలు ఉన్న సిరాజ్ వారి ద్వారా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ బిజినెస్ కు పక్కా ప్లాన్ వేశాడు. సిరాజ్ ఎవరికీ అనుమానం రాకుండా అహ్మద్ ఒమర్, అహ్మద్ సయీద్ @ షాలూఫా ద్వారా డ్రగ్స్ తెప్పించుకొని చిత్తూరులో ఉన్న వ్యక్తుల ద్వారా డ్రగ్స్ అమ్మించేవాడు. ఆదివారం ఉదయం అహ్మద్ ఒమర్, అహ్మద్ సయీద్ ను సిరాజ్ చిత్తూరుకు రమ్మని చెప్పాడు. వారి వద్ద డ్రగ్స్ తీసుకుంటుండగా ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు పరార్ అయ్యారు. అరెస్టైన వారిలో అరగొండకు చెందిన కే.సిరాజ్ (37), సూడాన్ కు చెందిన అహ్మద్ ఒమర్, అహ్మద్ సయీద్, చిత్తూరుకు చెందిన సురేష్ (25), జయశంకర్(32), ప్రతాప్(26), తేజ కుమార్(22), 
వెంకటేష్, మోహన్ ,మురళీ ఉన్నారు.  


పోలీసులు ఏం స్వాధీనం చేసుకున్నారంటే?


 పొట్లాల రూపంలో ఉన్న Psychotropic Substance Drugs రకానికి చెందిన MDMA [Methamphetamine] డ్రగ్స్ సుమారు 34 గ్రాములు, నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్లు,  డ్రగ్స్ వాడడానికి ఉపయోగించే 10 సిరంజీలు ,అతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్, సూడాన్ పాస్ పోర్టు, వీసాలతో పాటు పలు డాక్యుమెంట్లను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. వీరిపై చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు‌ చేశారు.