Chittoor Crime : చిత్తూరు జిల్లాలో దారి దోపిడీకి పాల్పడుతున్న గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు చిత్తూరు ఈస్ట్ సర్కిల్ పోలీసులు. కేసీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ పీఆర్వో జాన్సన్ పై దాడి చేసి 12 లక్షల రూపాయల నగదు ఆపహరించిందో ముఠా. గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లి సమీపంలో చిత్తూరు- తర్చూరు హైవే నిర్మాణం పనులు చేస్తోంది కేసీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆగస్టు ఒకటో తేదీన కంపెనీ పీఆర్వో జాన్సన్ పై దాడి చేసిన ముఠా రూ.12 లక్షలు దోచుకెళ్లింది. నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ఉదయం నిందితులను అరెస్టు చేశారు. నిందితులు అందరూ చిత్తూరు నగరానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ముఠా లీడర్ 19 సంవత్సరాల (మక్కిని భరత్) పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి 11 లక్షల రూపాయలు నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు ముద్దాయిలు పరారైనట్లు వెల్లడించారు పోలీసులు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.  


పరారీలో నలుగురు 


దారి దోపిడీకి ప్లాన్ వేసిన సూత్రదారి, భరత్ తల్లి తేజస్వినిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు అందరూ దాదాపు 20 సంవత్సరాల వయసు కలిగిన వారే అని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ విలాసాలకు అలవాటుపడి దారి దోపిడీలకు పాల్పడ్డారని వెల్లడించారు. గ్యాంగ్ లీడర్ మక్కిని భారత్ తో పాటు కె.విక్రం, తేజశ్రీ, యస్.సందీప్, జి.పవన్ కుమార్, ఎ.చరణ్ రాజ్, ఎ.లవ కుమార్, కె.పవన్ కుమార్, వి.కృష్ణలను రిమాండ్ కు తరలించారు పోలీసులు. రూపేష్, సాయి, పరంధామనాయుడు, ధనరాజ్ లు అనే మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.


క్లాస్ మేట్స్ సాయంతో  


'కేసీసీ కన్స్ స్ట్రక్షన్ కంపెనీకి చెందిన పీఆర్వో వ్యాపార నిమిత్తం కొంత నగదు తీసుకెళ్తుండగా కొందరు దుండగులు అడ్డగించి దోచుకెళ్లారని ఓ ఫిర్యాదు అందింది. గంగాధర నెల్లూరు జిల్లా కాలేపల్లి సమీపంలో  దారిదోపిడీ జరిగింది. పీఆర్వో వాహనాన్ని వెంబడించిన నిందితులు మార్గమధ్యలో వాహనాన్ని అడ్డగించి సుమారు రూ.12 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై దర్యాపు చేసి నిందితులను పట్టుకున్నాం. సుమారు 11 లక్షల వరకు రికవరీ అయింది. కొంతమంది పరారీలో ఉన్నారు. చిత్తూరు చెందిన భరత్(19) అనే వ్యక్తి చెన్నైలో బీటెక్ చదువుకున్నాడు. వాహనాలను రెంట్ కు ఇస్తుంటాడు. దానికి ఓ డ్రైవర్ ను పెట్టుకుని వాహనాలను రెంట్ కు నడిపిస్తాడు. పీఆర్వో దగ్గర ఓ వాహనాన్ని రెంట్ కు పెట్టాడు భరత్. పీఆర్వో తరచూ నగదు పట్టుకెళ్లడాన్ని ఆ డ్రైవర్ భరత్ కు తెలిపాడు. దీంతో భరత్ ప్లాన్ వేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. ఇతనితో పాటు స్కూల్ మేట్స్, కాలేజీ ఫ్రెండ్స్ 10 మంది వరకు దోపిడీలో పాలుపంచుకున్నారు.' - రిశాంత్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ