Chittoor News: రెండు రోజుల్లో వివాహం, ఇంతలో పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు.  తండ్రికి ఆరోగ్యం బాగోలేదని వెళ్లిన పెళ్లి కొడుకు ఇంక తిరిగి రాలేదు. ఇంతకీ అసలేం జరిగిందంటే. ఇద్దరు ప్రేమించుకున్నారు ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లికి సిద్ధమయ్యారు. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహ వేడుకకు బంధు మిత్రులను ఆహ్వానం కూడా పంపారు. ఇంతలో తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ వచ్చింది అత్యవసరంగా వెళ్లాలంటూ వెళ్లాడు. నగదు, నగలు ఇప్పించుకుని ఉడాయించాడు యువకుడు. పెళ్లి సమయానికి రాకపోయే సరికి ప్రేమించిన యువకుడి ఇంటికి తల్లిదండ్రులను వెంట బెట్టుకుని వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీసులను ఆశ్రయించింది యువతి. 


తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ 


చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం చౌకిళ్లవారిపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ చిన్న కుమారుడు కేదరనాథ్ తమిళనాడు రాష్ట్రంలో చదువుకున్నాడు. అప్పుడు తమిళనాడు రాష్ట్రం తాంబరానికి చెందిన చందన అనే యువతితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మబలికాడు కేదరనాథ్. అయితే తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పడంతో వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు పెళ్లి వేడుకలకు సిద్దం చేశారు. వధువు, వరుడి తల్లిదండ్రులు కలిసి వివాహ వేడుకలకు అవసరం అయ్యే బంగారు నగలు, నూతన వస్త్రాలు సైతం కొనుగోలు చేశారు. అనుకున్న విధంగానే వివాహ వేడుకలను నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కేదరనాథ్ తమిళనాడులోనే వధువు ఇంటి వద్ద ఏర్పాట్లను సైతం తనే దగ్గరుండి మరి చూసుకునే వాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ వచ్చిందని అమ్మాయిని, ఆమె తల్లిదండ్రులను నమ్మించి, వారి వద్ద నగదు, నగలు తీసుకుని స్వగ్రామానికి వెళ్తున్నట్లు నమ్మించాడు. 


వరుడు ఇంటి ముందు ధర్నా 


మరో రెండు రోజుల్లో పెళ్లి వేడుకలు ఇంతలో ఇలా జరిగిందేంటీ అని అనుకున్న చందన తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు చెప్పి కేదరనాథ్ ను బస్సు ఎక్కించారు. పెళ్లి సమయానికి వచ్చేస్తానని చెప్పిన కేదరనాథ్ బస్సు ఎక్కాడు. స్వగ్రామానికి వచ్చిన కేదరనాథ్ తన తండ్రి ఆరోగ్యం బాగుందని, ఎటువంటి ఇబ్బంది లేదని చందన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంతలో పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. కేదరనాథ్ కు ఫోన్ చేస్తే స్విఛ్ ఆఫ్ అని రావడంతో, కేధరనాథ్ తల్లిదండ్రులకు ఫోన్ కలిపారు వారిది ఫోన్ స్వీఛ్ ఆఫ్ అని రావడంతో అనుమానం వచ్చిన చందన తల్లిదండ్రులు కేదరనాథ్ ఇంటికి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో గ్రామంలో విచారించారు. కేదరనాథ్ కుటంబ సభ్యుల నుంచి ఎటువంటి సమాచారం తెలియక పోవడంతో తిరిగి తాంబరం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేదరనాథ్ ఇంటి వద్ద వధువు చందన బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 21వ తేదీన పెళ్లి ఖరారు కాగా పెళ్లికి రెండు రోజుల ముందు తండ్రికి బాగోలేదని చెప్పి పరార్ అయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా పెళ్లి ముహూర్తానికి పరారవ్వడంపై నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను  వేడుకోంది.