Chittoor Crime : అక్రమ సంబంధాలు కుటుంబాలను కూలుస్తున్నాయి. పాశ్చత్య దేశాల సంస్కృతిలో ఒక భాగమైన అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. రోడ్డున పడినవి కొన్ని అయితే, ప్రాణాలపైకి తెచ్చుకున్నవి మరికొన్ని. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో తన కన్నా వయస్సులో చిన్నవాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఏకంగా ప్రాణాలపైకి తెచ్చుకుంది. 


అసలేం జరిగిందంటే?


చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కట్టుబావి గ్రామానికి చెందిన గంగాధర్(32) అనే యువకుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గంగాధర్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కూలీ పనులకు వెళ్తున్న క్రమంలో బోగ్గిటివారిపల్లె గ్రామానికి చెందిన చంద్రమ్మ(46)తో పరిచయం ఏర్పడింది. కూలీ పనులు ముగించుకుని రోజు ఇంటికి వెళ్లే సమయంలో గంగాధర్ చంద్రమ్మను తన ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చేవాడు. ఇలా కొద్ది రోజుల పాటు సాగింది.‌ చంద్రమ్మకు భర్త చనిపోవడంతో గంగాధర్ తో చనువుగా ఉండేది. వీరిద్దరి చనువు‌ కాస్తా వారి మధ్య సంబంధానికి దారి తీసింది. చంద్రమ్మ కూలీ పనులు చేసుకుంటూ తన ఇద్దరి కుమార్తెలను చదివించుకుంటూ ఉండేది. ఇలా ఇద్దరు కలిసే రోజు కూలీ పనులకు వెళ్లేవారు. ఇలా చంద్రమ్మతో గంగాధర్ అక్రమ సంబంధం దాదాపు ఏడు సంవత్సరాలు గుట్టు చప్పుడు కాకుండా సాగింది.  


సంబంధం కొనసాగించాలని వాగ్వాదం 


చంద్రమ్మ ఇద్దరు కుమార్తెలు పెద్ద వారు కావడంతో గంగాధర్ ను దూరం పెడుతూ వచ్చేది. ఈ విషయంపై చంద్రమ్మ, గంగాధర్ ల మధ్య గొడవ జరిగింది. తన కుమార్తెలు పెద్దవారు అవుతున్నారని వారి ముందు తలదించుకోవాల్సి పరిస్థితి వస్తుందని చంద్రమ్మ గంగాధర్ కు నచ్చజెప్పింది. అయితే చంద్రమ్మ మాటలు ఏమాత్రం పట్టించుకోని గంగాధర్ చంద్రమ్మను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. దీంతో గంగాధర్ కూలీ పనులకు వెళ్లే ప్రాంతంలో పనికి వెళ్ళడం మానేసింది చంద్రమ్మ. దీంతో గంగాధర్ చంద్రమ్మను నిలదీశాడు. ఇకపై ఎలాంటి సంబంధం లేదని చంద్రమ్మ తేల్చి చెప్పడంతో కోపంతో ఊగి పోయిన గంగాధర్ శుక్రవారం మంగమ్మ ఉన్న లాభాల గంగమ్మ గుడి వద్దకు వెళ్లాడు. అందరూ చూస్తుండంగానే చంద్రమ్మతో వాగ్వాదానికి దిగ్గాడు. చంద్రమ్మ తనను పట్టించుకోవడం లేదనే కోపంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న కొడవలితో చంద్రమ్మ మెడపై నరికాడు. దీంతో చంద్రమ్మ మెడ భాగంలో తీవ్రగాయం అయింది. తీవ్ర రక్త స్రావంలో పడి ఉన్న చంద్రమ్మను స్థానికులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గంగాధర్ కోసం గాలిస్తున్నారు.