సమాజంలో రోజు రోజుకీ మానవత్వం మరిచి పోతున్నారు కొందరు దుర్మార్గులు. చిన్న చిన్న కారణాలకే పసికందులను అత్యంత కిరాతకంగా హత్య(Murder) చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు కనికరం లేకుండా గ్రామం శివారులో ఓ చెట్టుకి ఉరి వేసి హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతుంది.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా(Chittoor District) కలికిరి మండలం ఆద్దావారిపల్లి గ్రామానికి చెందిన రవి, తులసీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. రవి చిన్న కుమారుడు ఎనిమిదేళ్ల ఉదయ్ కిరణ్ మూడో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 11వ తేదీన తల్లి తులసి కలికిరిలోని బ్యాంకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా తాను వెంట వస్తానని ఉదయ్ కిరణ్ మారం చేశాడు. అందుకు తులసీ అంగీకరించకుండా ఇంటి వద్ద ఉండి చదువుకోమని చెప్పి బ్యాంకుకి వెళ్లింది. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన తులసీ, పిల్లల కోసం తీసుకొచ్చిన తినుబండారాలు ఇచ్చేందుకు ఉదయ్ కిరణ్ కోసం వెతికింది. గ్రామం అంతా వెతికినా ఉదయ్ కిరణ్ కనిపించక పోవడంతో, గ్రామస్తులకు విషయం చెప్పి గాలించినా ఫలితం లేకుండా పోయింది.
గ్రామ శివారులో చెట్టుకు వేలాడుతూ బాలుడి మృతదేహం
మరుసటి రోజు శనివారం ఉదయం కలికిరి పోలీస్ స్టేషన్లో తన కుమారుడు కనిపించడంలేదని ఫిర్యాదు చేసింది తులసీ. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉదయ్ కిరణ్ శవమై వేలాడుతూ ఉండటాన్ని చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి శవాన్ని దించి ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మదనపల్లి డీఎస్పీ మనోహర్ ఆచారి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్స్ స్క్వాడ్ సహాయంతో బాలుడి హత్యకు గల కారణాలు కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కలికిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. గుర్తు తెలియని దుండగులు బాలుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడా దీశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.