ఐఏస్ కుమారుడి అనుమానాస్పద మృతి 


చండీగఢ్‌లో ఓ ఐఏస్ ఆఫీసర్ కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఐఏఎస్ సంజయ్ పొప్లి కొడుకు కార్తీక్ పొప్లిని ఇటీవలే పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది. అవినీతి ఆరోపణల కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు రిమాండ్‌లో ఉంచారు. శనివారంతో రిమాండ్ ముగిసే సమయానికి మరోసారి పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అధికారులు సంజయ్ పొప్లి ఇంటికి వెళ్లారు. ఈ సమయంలోనే గన్‌ షాట్ వినిపించిందని, కార్తిక్ తనకు తానుగానే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని చండీగఢ్ ఎస్‌ఎస్‌పీ కుల్‌దీప్ చాహల్ వెల్లడించారు.





 


అధికారులే చంపారు: మృతుడి కుటుంబ సభ్యులు


అయితే సంజయ్ పొప్లి కుటుంబ సభ్యులు మాత్రం విజిలెన్స్ బ్యూరో అధికారుల వల్లే తన కొడుకు చనిపోయాడని, విచారణ పేరిట టార్చర్ చేశారని ఆరోపించారు. ఐఏఎస్ ఆఫీసర్‌ సంజయ్ పొప్లిని ఓ ఫైల్‌పై సంతకం చేయాలని విజిలెన్స్ బృందం బలవంతం చేసిందని, మాట వినకపోతే కొడుకుని చంపేస్తామంటూ బెదిరించారని...ఓ బంధువు ఆరోపణలు చేశారు. అధికారులు సంజయ్‌ పొప్లిని ఓ గదిలో వేసి బంధించిందని, కార్తిక్‌ను తీసుకుని పైకి వెళ్లారని చెప్పారు. కాసేపటి తరవాత బులెట్ సౌండ్ వినిపించిందని, అధికారులే కార్తిక్‌ను హత్య చేశారని ఆరోపణలు చేస్తున్నారు. 


ఆ ఆరోపణల్లో నిజం లేదు: అధికారులు 


ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒత్తిడి ఉందని, అందుకే ఇలా తన కొడుకుని హత్య చేశారని తల్లి విమర్శిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని విజిలెన్స్ బృందం కొట్టిపారేసింది. అవన్నీ నిరాధారమని తేల్చి చెప్పింది. విచారణలో నిజానిజాలు బయటపడతాయని వివరిస్తున్నారు. ఇటీవలే సంజయ్ పొప్లి ఇంట్లో 12 కిలోల బంగారం, మూడు కిలోల వెండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకుంది. అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదు చేసింది.