Kolkata Doctor Case: కోల్‌కతా కేసు నిందితుడు సంజయ్ రాయ్‌ ఒంటిపై అక్కడక్కడా గాయాలు కనిపించాయి. ముఖంపైనా గాయాలయ్యాయి. వీటిపైనా సీబీఐ అధికారులు విచారణ చేపడుతున్నారు. పైగా ఇవన్నీ పాత గాయాలు కాదు. ఇటీవలే అయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అధికారులు తరచూ ప్రశ్నిస్తున్నా సంజయ్ రాయ్ సరైన సమాధానం చెప్పడం లేదు. పాలిగ్రఫీ టెస్ట్‌కి ముందే వీటిని గుర్తించారు. నిజానికి ఈ పాటికే లై డిటెక్టర్ టెస్ట్ పూర్తి కావాల్సింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ గాయాలు కూడా కొన్ని కీలక విషయాలు  బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. Telegraph వెల్లడించిన వివరాల ప్రకారం ఓ సీబీఐ అధికారి నిందితుడి గాయాల గురించి మాట్లాడారు. సంజయ్ రాయ్‌కి రెండు మోచేతులపైనా గాట్లు ఉన్నాయి. హత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలు ప్రతిఘటించడం వల్ల ఈ గాయాలు అయ్యుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన సంజయ్ రాయ్‌ని కస్టడీలోకి తీసుకున్నప్పుడే ఈ గాయాలు కనిపించాయి. నడుముకీ గాయం కనిపించింది. ఇవన్నీ నేరం జరిగినప్పుడు అయినవే అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 


"సంజయ్ రాయ్‌ శరీరంపై అక్కడక్కడా గాయాలున్నాయి. వీటి గురించి మేం విచారించాం. కానీ నిందితుడు మాత్రం తనను తానే గాయపరుచుకున్నట్టు చెబుతున్నాడు. ఎందుకు చేసుకున్నావని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదు. బహుశా హత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలు ప్రతిఘటించడం వల్ల ఈ గాయాలు అయ్యుండొచ్చు. నడుముపై భాగాన గాయం ఉంది. తనపై అత్యాచారం చేయకుండా బాధితురాలు అడ్డుకోడానికి ప్రయత్నించి ఉండొచ్చు"


- సీబీఐ అధికారి


అయితే...ఈ గాయాలకు సంబంధించి నిజానిజాలన్నీ లై డిటెక్టర్ టెస్ట్‌తో  వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. అసలు తనకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు సంజయ్ రాయ్. తనను ఇరికించారనీ అంటున్నాడు. పైగా కోర్టులో జడ్జ్ ముందు ఇదంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవలే విచారణలో నేరాన్ని అంగీకరించినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు మాత్రం మాట మార్చాడు. ఇదంతా విచారణను తప్పుదోవ పట్టించడానికే చేస్తున్నాడన్న వాదన వినిపిస్తోంది.


ఇరికించారంటున్న నిందితుడు..


అటు సంజయ్ రాయ్ తల్లి కూడా తన కొడుకుని ఎవరో ఇరికించారని ఆరోపిస్తోంది. ఆ ఇరికించిన వాళ్లెవరో త్వరలోనే బయట పడుతుందని, వాళ్లకీ శిక్ష పడుతుందన్న నమ్మకముందని అంటోంది. కానీ...సంజయ్ రాయ్ పొరుగింటి వాళ్లు మాత్రం అతనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళల్ని వేధిస్తాడని, అతను వస్తున్నాడంటేనే తలుపులు మూసుకునే వాళ్లమని అంటున్నారు. నాలుగు పెళ్లిళ్లయ్యాయని,భార్యల్ని వేధించే వాడని చెబుతున్నారు. ఈ కేసులో ఈ విషయాలన్నీ కీలకంగా మారనున్నాయి. నిందితుడికి ఇంకెవరైనా సహకరించి ఈ హత్యాచారం చేయించారా అన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో సంజయ్ రాయ్‌ని మాత్రమే అరెస్ట్ చేశారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేయనుంది సీబీఐ. 


Also Read: Kolkata: జైల్‌ గార్డులతో ప్రత్యేకంగా మాట్లాడిన నిందితుడు, వెలుగులోకి షాకింగ్ విషయాలు!