Jhamunda Instagram: ఇన్ స్టాగ్రామ్ లో ఝాముడా(Jhamunda), ఝాముండా అఫీషియల్(jhamunda_official), ఝాముండా అఫీషియల్ 2(jhamunda_official_2) అనే పేరుతో ఓ ముఠా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ మహిళలను కించపరుస్తోంది. ఒక వర్గానికి చెందిన మహిళలనే టార్గెట్ చేస్తూ వారిని ఫోటోలు, వీడియోలు తీసి.. ఆ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో పోస్టు చేస్తోంది. అసభ్యకర పదజాలం వాడుతూ ఆ వీడియోపై, ఫోటోలపై కామెంట్లు చేస్తూ వాటిని వైరల్ చేస్తోంది.
ఒక వర్గం వారే ఆ ముఠా లక్ష్యం
మీరు మీ స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తుంటే.. ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా అనుసరిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు చేసేదంతా షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. వింటుంటే భయమేస్తోందా.. ఝాముండా ఇన్ స్టా పేజీలో జరిగే తతంగం ఇదే. హైదరాబాద్‌లో మోటారు వాహనాల నుంచి మాల్స్ వరకు వివిధ బహిరంగ ప్రదేశాలలో గుర్తు తెలియని వ్యక్తులు.. కొంత మంది యువతీ యువకులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను చిత్రీకరించి మా కమ్యూనిటీ పరువు నాశనం చేస్తున్నారంటూ అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తమకు సంబంధించిన పోస్టులు ఇతర వ్యక్తుల నుంచి వారికి చేరడంతోనే బాధితులకు ఈ ముఠా ఆగడాలు తెలుస్తున్నాయి. కొంత మంది బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ పేజ్ లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పోలీసులు ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాశారు. అలాగే ఝాముండా పేజ్ పై 506, 509, 354(D) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
యువతులపై అసభ్యకర పోస్టులు
ఈ పోస్ట్‌లలో చాలా వరకు '---కా నామ్ బర్బద్ కియా', 'యాక్ట్ ఎగైనెస్ట్ ---న్' వంటి వ్యాఖ్యలు బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తున్నాయి. ఒక వీడియోలో.. ఒక యువకుడు, యువతి బైక్ పై వెళ్తుంటే.. మరో వాహనంపై కెమెరాతో వారిని అనుసరిస్తున్నారు. ఒక మతానికి చెందిన మహిళ.. వేరే మతానికి చెందిన వ్యక్తితో డేటింగ్ చేస్తోందంటూ ఝాముండా పేజీ వారిపై అసభ్యకర కామెంట్లు చేసింది.
ఒకటి కాదు.. అంతకుమించి
jamunda_official కాకుండా, ఇన్ స్టాగ్రామ్ లో ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేసే ఝాముండ 2, ఝాముండా, ఝాముండా ఆర్మీ వంటి పేర్లతో మరికొన్ని పేజీలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుల తర్వాత jamunda_official పేజీ నుంచి పోస్ట్‌లు తొలగించారు. ఇతర అనధికారిక పేజీలలో మాత్రం కొన్ని పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఝాముండా అధికారిక పేజీలో పోస్ట్‌లు లేవు. కానీ వివిధ పేజీల్లో మాత్రం చాలానే ఉన్నాయి. వాటిని కూడా తొలగించాలని పలువురు కోరుతున్నారు.
నిందితుల కోసం పోలీసుల గాలింపు
పేజీ కార్యకలాపాలను కొంత మంది వ్యక్తులు ట్విట్టర్ లో రిపోర్టు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులకు, సైబర్ క్రైం పోలీసులను ట్యాగ్ చేస్తూ ఝాముండా పేజీ ఆగడాలను వెల్లడిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు ఈ పేజీ నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. ఎలాగైనా సరే వారిని పట్టుకొని ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయాలని తీవ్రంగా కష్టపడుతున్నారు.