Boy Died Due To Falling Down In Sambar In Kurnool District: అన్నం తినేటప్పుడు మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపాలనో చాలామంది చిన్నారులకు సెల్ ఫోన్ అలవాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే అది వ్యసనంగా మారి చిన్నారులు మొబైళ్లకు బానిసవుతున్నారు. అలా మొబైల్‌లో గేమ్ ఆడుతూ కర్నూలు జిల్లాకు (Kurnool District) చెందిన బాలుడు ప్రమాదవశాత్తు సాంబారులో పడి మృతి చెందిన విషాద ఘటన గద్వాల జిల్లాలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా గోనెగండ్ల (Gonegandla) మండలం వేమూగోడుకు చెందిన జగదీష్ అమ్మానాన్నలతో కలిసి మేనమామ పెళ్లి కోసం గద్వాల జిల్లా (Gadwal District) వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామానికి వెళ్లాడు. అయితే, పెళ్లి కోసం సిద్ధం చేసిన వంటలను ఓ గదిలో ఉంచారు. మొబైల్‌లో గేమ్ ఆడుతున్న జగదీష్.. చూసుకోకుండా వెళ్లి సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. ఈ క్రమంలో గిన్నె మూత పక్కకు జరగడంతో వేడిగా ఉన్న సాంబారులో జగదీష్ పడిపోయాడు.
బాలుడి కేకలు విన్న బంధువులు వెంటనే స్పందించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని పలువురు పేర్కొంటున్నారు.
బాలుడిని ఢీకొన్న బస్సు
అటు, అనకాపల్లి జిల్లాలో ఓ ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఈ ఘటన జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మామిడిపల్లికి చెందిన దొగ్గ దేముళ్ల ఫార్మా సిటీలో పని చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. తండ్రి విధులకు వెళ్తుండగా.. ఆయనతో పాటు దగ్గర్లోని బస్టాప్‌నకు వెళ్లిన పవన్ కుమార్ హైవేపై డివైడర్‌ను దాటి తిరిగి వస్తుండగా.. ఫార్మా సిటీ నుంచి వస్తోన్న బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్ స్థానికంగా ఓ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. విగతజీవిగా పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంలో ముగ్గురు మృతి
మరోవైపు, ఒంగోలు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు సహా వారి స్నేహితుడు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని కొప్పోలు ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు స్కూటీపై వెళ్తుండగా కొప్పోలు దగ్గర వీరి బైక్‌ను నీటి ట్యాంకర్ ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు వికాస్ (12), విశాల్ (9), రేష్వంత్ (18)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.