Vizag News: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్న కారణంతో వైసీపీ నేతలపై ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. ఈ కేసుల అంశంపై కోర్టులో పోరాడుదామనుకుంటున్న వైసీపీ నేతలకు తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్యలు పెద్ద షాక్ ఇస్తున్నాయి. 


వైసీపీ అధికారంలో ఉన్న టైంలో చంద్రబాబు, లోకేష్‌పై ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పి మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. విశాఖలో ఓ మహిళ ఈ ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేశారని ఇప్పటికే పలువురు వైసీపీ కార్యకర్తలు ఆరెస్టు అయ్యారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఇంత వరకు పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని. వర్రా రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తులనే అరెస్టు చేశారు. మిగతా వారి జోలికి ఇంత వరకు వెళ్లలేదు. 


ఇప్పటి వరకు విచారణ పేరుతో నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు ఇకపై అరెస్టులు చేయబోతున్నారని తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులను మానసికంగా కుంగదీసేలా పెట్టే పోస్టులపై కఠినంగా ఉండాలంటూ నిర్ణయానికి వచ్చారు. ఈ మధ్య అసెంబ్లీలో కూడా దీనిపై పదే పదే ప్రస్తావనకు వస్తోంది. అన్ని వర్గాల నుంచి కూడా పోలీసులపై ఒత్తిడి వస్తోంది. తప్పు చేసిన వాళ్లు దొరికినప్పటికీ సరిగా స్పందించడం లేదన్న అపవాదు ఉంది. 



అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కీలకమైన ఆధారాలు సేకరించిన పోలీసులు మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నారు. దీనికి ఈ మధ్య కోర్టు చేస్తున్న కామెంట్స్ కూడా బలాన్ని ఇస్తున్నాయి. మనసులు గాయపరిచేలా పోస్టులు పెడితే కేసులు బుక్ చేసి అరెస్టు చేయకుండా ఉంటారా అంటూ హైకోర్టు ఈ మధ్య వ్యాఖ్యానించింది. ఇలాంటి అరెస్టులపై దాఖలు అవుతున్న పిటిషన్లను తప్పుబడుతున్న కోర్టు సీరియస్ కామెంట్స్ చేస్తోంది. 


వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసి కీలక విషయాలు రాబడుతున్న పోలీసులు అవినాష్ పీఏ రాఘవరెడ్డి కోసం గాలిస్తున్నారు. సర్చ్ వారెంట్ కూడా జారీ చేశారు. ఆయన కోసం పోలీసులు అన్ని మార్గాల్లో జల్లెడ పడుతున్నారు. ఆయన చిక్కితే ఈ కేసులో మరింత మంది అరెస్టు ఖాయమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. 


పోసాని కృష్ణమురళి, రాంగోపాల్ వర్మ, శ్రీరెడ్డి ఇలా పలువురు ప్రముఖలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే 19న విచారణకు రావాలని రాంగోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇలా కేసులు నమోదు అయిన వారందరికీ నోటీసులు జారీ చేసి విచారణ పిలవాలని చూస్తున్నారు. ఒకసారి వారిని విచారించిన తర్వాత దర్యాప్తు స్పీడ్ పెంచబోతున్నారు. 


మరోవైపు ఈ కేసుల్లో వైసీపీపై సానుభూతితో ఉన్న పోలీసులకు ప్రభుత్వం గట్టిగానే హెచ్చరికలు జారీ చేసిందని తెలుస్తోంది. పద్దతి మార్చుకోవాలని చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచిస్తున్నారు. విచారణ సమాచారం బయటకు వెళ్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వర్రాకు సహకరించిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మిగతా వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.