Bihar Crime News: భర్తలను అతి దారుణంగా చంపుతున్న భార్యల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా బిహార్‌లో వెలుగు చూసిన కేసులో మహిళ మామతోనే ప్రేమలో పడి భర్తను హత్య చేసింది. ఈ హత్య కేసులో ఓ గ్యాంగ్‌ను పురమాయించింది. హత్య కేసు విచారించిన పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. 

Continues below advertisement


బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గుంజాదేవికి ప్రియాంశు అనే వ్యక్తితో రెండు నెలల క్రితం పెళ్లైంది. నిశ్చితార్థం తర్వాత తరచూ ఆ ఇంటి వాళ్లు ఈ ఇంటికి ఈ ఇంటివాళ్లు ఆ ఇంటికి వెళ్లి వస్తుండే వాళ్లు. ఈ క్రమంలోనే గుంజాదేవి మామ జీవన్‌సింగ్‌పై మనసు పారేసుకుంది. అతని వయసు 55 ఏళ్లు. అతను కూడా కాబోయే కోడలి ప్రేమను కాదనలేకపోయాడు. 


పెళ్లి అయ్యే లోపు మామకోడలి ప్రేమ మరింత ముదిరింది. దీంతో మామ జీవన్‌ సింగ్‌పై తను మనసు పడ్డానని అతన్నే పెళ్లి చేసుకుంటానని కూడా గుంజాదేవి పట్టుబట్టింది. కానీ ఇంట్లో వాళ్లు చీవాట్లు పెట్టారు. ఇదేం పాడుబుద్ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివి కుదరవని ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేయడానికి వీలు లేదని గుట్టుచప్పుడు కాకుండా ప్రియాంశు పెళ్లి జరిపించేశారు.  


పెళ్లి అయిన తర్వాత అన్నీ సర్దుకుంటాయని అనుకున్నారు. కానీ ప్రియుడి ఇంటికే కోడలిగా వెళ్లింది గుంజాదేవి. ఇవేమీ తెలియని ప్రియాంశు తన భార్యతో నార్మల్‌గానే ఉన్నాడు. తన ఉద్యోగం పని మీద బయటకు వెళ్తున్నాడు వస్తున్నాడు. కానీ ఆయన లేని సమయంలో మాత్రం మామ కోడలు మరింత దగ్గరయ్యారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని విధంగా పరిస్థితి చేయిదాటిపోయింది. 


మామ ప్రేమలో పీకల్లోతులో మునిగిపోయిన గుంజాదేవి భర్త ప్రియాంశు అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. బలవంతపు వివాహాన్ని అంగీకరించలేకపోయింది. వెంటనే సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడింది. ఇంతలో పని మీద ప్రియాంశు ట్రైన్‌లో బయటకు వెళ్లాడు. విషయాన్ని సుపారీ గ్యాంగ్‌కు చెప్పిన గుంజాదేవి ఖతం చేసి కబురు పెట్టాలని చెప్పింది. 


గుంజాదేవి ఆదేశాల మేరకు సుపారీ గ్యాంగ్‌ ప్రియాంశును రైలు దిగిన తర్వాత హతమార్చారు. నవీనగర్‌ స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా కాల్పి చంపేశారు. స్పాట్‌లోనే ప్రియాంశు చనిపోయాడు. కాల్పు ఘటన, వ్యక్తి హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజ్‌తో నిందితుల వివరాలు గుర్తించారు. 


పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో అప్పటి వరకు కూల్‌గా ఉన్న గుంజాదేవిలో టెన్షన్ మొదలైంది. నిందుతులు దొరికిపోతే తాను అరెస్టు అయిపోతానని భయపడి ఇంటి నుంచి పారిపోయేందుకు యత్నించింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను పట్టుకున్నారు. నిలదీశారు. దీంతో అసలు విషయం చెప్పింది. వాళ్లు వెంటనే పోలీసులకు కాల్ చేసి గుంజాదేవిని అప్పగించారు. 


గుంజాదేవిని అరెస్టు చేసిన పోలీసులు సెల్‌ఫోన్ పరిశీలించారు. కాల్‌ డేటాను చెక్ చేశారు. మామ జీవన్‌తో ఆమె కాల్‌ రికార్డులను పరిశీలించగా.. జీవన్‌ సింగ్‌తో కంటిన్యూగా మాట్లాడినట్టు గుర్తించారు. అతడి కాల్‌డేటాను కూడా పరిశీలించారు. ఇద్దరూ సుపారీ గ్యాంగ్‌తో తరచూ మాట్లాడినట్టు కూడా తేల్చారు. ఇప్పుడు ఈ కేసులో గుంజాదేవితోపాటు కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. జీవన్ సింగ్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.