మంత్రి ఇంటి సమీపంలోని పండ్లతోటలో ఆడుకుంటున్న పిల్లలను తరిమికొట్టేందుకు కాల్పులు జరపడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మంత్రి కుమారుడు, సిబ్బంది పిల్లలపై దాడి చేశారు. దీంతో చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు బిహార్ మంత్రి కుమారుడితో వాగ్వాదానికి దిగారు. మంత్రి కుమారుడిపై దాడి చేశారు. కొంతమంది వ్యక్తులు దాడి చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి.
తోటను ఆక్రమిస్తున్నారని మంత్రి ఆరోపణలు
బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లా హర్దియా గ్రామంలో బీజేపీ నేత, ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి నారాయణ ప్రసాద్ నివాసం ఉంటున్నారు. మంత్రి కుమారుడు బబ్లూ కుమార్ తన ఇంటి సమీపంలోని తోటలో క్రికెట్ ఆడుతున్న పిల్లలను భయపెట్టడానికి గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఒక చిన్నారితో సహా ఆరుగురు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్థులు ఆగ్రహంతో ప్రభుత్వ వాహనంలో అక్కడికి వెళ్లిన మంత్రి కుమారుడిపై దాడి చేశారు. మంత్రి కొడుకు వాహనాన్ని వదిలి పారిపోయాడు. ఆ తర్వాత స్థానికులు ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. అయితే మంత్రి కుమారుడు తోట ఆక్రమణ గురించి తెలుసుకున్న అక్కడికి వెళ్తే గ్రామస్థులు దాడి చేసి, లైసెన్స్ ఉన్న తుపాకీని దోచుకున్నారని మరో వర్గం చెబుతోంది. గ్రామస్తుల ఆరోపణలు నిరాధారమైనవని అంటున్నారు. తన పరువు తీసేందుకు రాజకీయ కుట్ర అని మంత్రి నారాయణ ప్రసాద్ అన్నారు. గాయపడిన గ్రామస్తులను ఆసుపత్రికి తరలించి, కాల్పులు జరిపిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ ఉపేంద్ర వర్మ తెలిపారని పీటీఐ పేర్కొంది.
Also Read: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
గ్రామస్తుల వాదన మరోలా
మంత్రి నారాయణ ప్రసాద్ ఇల్లు సమీపంలోని మామిడి తోటలో ఆదివారం కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ ఆడకూడదని, తక్షణమే వెళ్లిపోవాలని మంత్రి కుమారుడు బబ్లూ కుమార్ తో పిల్లలను హెచ్చరించారు. అందుకు వారు నిరాకరించారు. కొందరు పెద్దలు పిల్లలకు తోడయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడినుంచి వెళ్లిపోయిన బబ్లూ కాసేపటి తర్వాత నాలుగు వాహనాల్లో తన అనుచరులను తిరిగి వచ్చి వారిపై దాడిచేశారు. ఈ ఘర్షణలో ఆవేశంతో బబ్లూ కుమార్తన వద్ద ఉన్న తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. బబ్లూ కుమార్ అనుచరులు జరిపిన దాడిలో నలుగురు పిల్లలు గాయపడ్డారు. దాడి, కాల్పుల గురించి తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో మంత్రి ఇంటిపైకి దండెత్తారు. మంత్రి వాహనాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బబ్లూ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంత్రి ఇంటి వద్ద ఒక పిస్టల్, రైఫిల్స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతవరకు మంత్రి కుమారుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.