Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో నేడు సైతం అకాల వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాలేదు.


కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. జనవరి 26 వరకు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురవనుండగా.. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత వర్షాల కారణంగా పెరిగింది.   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో నేడు వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యల్పంగా కళింగపట్నంలో 17.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గలేదు కానీ వర్షాల కారణంగా చలి గాలులు వీస్తున్నాయి.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చలి ప్రభావం మరింతగా పెరుగుతోంది. అనంతపురంలో 17 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 18.5 డిగ్రీలు, నంద్యాలలో 19 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో అకాశం నిర్మలమై ఉంటుంది. ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత అధికమైంది.  కనిష్ట ఉష్ణోగ్రత 18.5 ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో నే కొన్ని జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  స్పష్టం చేశారు.


Also Read: Horoscope Today 24 January 2022: ఈ నాలుగు రాశులవారు ఈ రోజు సంతోషంగా ఉంటారు


 Also Read: Gold Silver Price Today 24 January 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి