తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా అడ్డుకట్టపడడంలేదు. పోలీసులు ఎన్ని పటిష్ట చర్యలు చేపట్టినా ఏదో విధంగా వారి కళ్లుగప్పి గంజాయిని బోర్డర్ దాటించేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.కోటి అరవై లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా టైల్స్‌ కింద గంజాయిని పెట్టి తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ సోమవారం మీడియాకు వివరించారు. మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ కు చెందిన దినేష్‌ తన స్నేహితుడు సునీల్‌తో కలిసి గంజాయి వ్యాపారానికి సిద్ధమయ్యాడు. 


Also Read:  మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


ఏపీ టు మధ్యప్రదేశ్ 


ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఒక టైల్స్‌ ఫ్యాక్టరీలో టైల్స్‌ కొనుగోలు చేశారు. టైల్స్ ను లారీలో అక్కడ్నుంచి ఛత్తీస్‌గడ్‌ లోని కుంట ప్రాంతానికి తరలించి ఒక వ్యక్తి వద్ద నుంచి 825 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. వీటిని టైల్స్‌ కింద అమర్చి తెలంగాణలోని భద్రాచలం, హైదరాబాద్‌ మీదుగా మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరవేసేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం అందుకున్న చుంచుపల్లి పోలీసులు తనిఖీలు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దినేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


Also Read: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ


150 కేజీల గంజాయి స్వాధీనం


ఒడిశా  నుంచి దిల్లీకి గంజాయి రవాణా చేస్తోన్న ఓ ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు తెలిపిన వివరాలు ప్రకారం పంజాబ్ కు చెందిన సిమన్ సింగ్, లబఖర, రోహిత్ పాంగి, కృష్ణ ఖేముడు, పాంగి నరసింహరావులను అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు హేరా సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 3 లక్షల విలువైన 150 కేజీల గంజాయిని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై వచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.కిషోర్ బాబు ఆధ్వర్యంలో అన్నవరం ఎస్.ఐ. ఎస్.రవికుమార్, సిబ్బంది ఆదివారం రాత్రి సుమారు గం.7 లకు అన్నవరం గ్రామ శివారులో మండపం గ్రామం వెళ్లే రోడ్ లో తనిఖీలు నిర్వహించగా ఒడిశా రాష్ట్రం చిత్రకొండ అటవీ ప్రాంతం నుంచి దిల్లీకు గంజాయి రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నారు. పార్కు చేసి ఉన్న కారులో నుంచి గంజాయిని లారీలో లోడ్ చేస్తుండంగా పోలీసులు పట్టుకున్నారు. 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి