Yoga Helps Teacher To Escape From Death: యోగా, ప్రాణాయామం వంటి వాటితో సంపూర్ణ ఆరోగ్యం అని మనకు తెలుసు. కానీ, అదే యోగ విద్య ఆమె ప్రాణాలు నిలిచేలా చేసింది. కొందరు దుండగులు ఆమెను హత్య చేయాలని యత్నించగా.. యోగా సాయంతో చాకచక్యంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా దిబ్బూరహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేవనహళ్లికి చెందిన యువతి (34) భర్త నుంచి విడిపోయి దిబ్బూరహళ్లిలో ఒంటరిగా ఉంటున్నారు. సంతోష్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పరిచయమై అది కాస్త ప్రేమగా మారింది. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ సదరు యువతిని హత్య చేసేందుకు సంతోష్.. ఆమె దగ్గర యోగా నేర్చుకుంటోన్న సతీష్‌రెడ్డి సాయం కోరాడు. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతోన్న సతీష్ రెడ్డి, తన సహచరులు రమణ, సల్మాన్, రవిలతో పాటు సంతోష్ కలిసి యువతిని అక్టోబర్ 23న కిడ్నాప్ చేశారు.
యోగా సాయంతో..
నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి యత్నించారు. ఆమె కేకలు వేయడంతో గొంతు నులిమారు. ఊపిరి తీసుకోకపోవడంతో ఆమె చనిపోయిందనుకుని.. అక్కడే గుంత తీసి అందులో పడేసి పరారయ్యారు. అయితే, యోగా సాధనలో పరిణతి ఉన్న యువతి శ్వాసను నియంత్రించి చనిపోయినట్లు నటించింది. నిందితులు అక్కడి నుంచి వెళ్లిన అనంతరం గుంత నుంచి ప్రాణాలతో బయటపడింది. స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కుశాల్ చౌక్సే తెలిపారు. పరారీలో ఉన్న కీలక నిందితుడు సంతోష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్, హౌరాకు సమీపంలో ఘటన