Bapatla Crime News: బాపట్ల జిల్లాలో సంతమాగులూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు - కర్నూలు ప్రధాన రహదారిపై  సంతమాగులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఆటోను ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 


స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. సంతమాగులూరు వద్ద 7 మందితో వెళ్తున్న ఆటోను నరసరావుపేట నుంచి వినుకొండ రోడ్డు వైపు వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గుంటూరు నల్లపాడుకు చెందిన కేటరింగ్ వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఆటో మార్కాపురం వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.