B Pharmacy Student Death Case: రాష్ట్రంలో సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థి తేజస్విని మృతి కేసులో నిందితుడు సాధిక్‌ను శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో విద్యార్థినిని నమ్మించి, అన్ని రకాలుగా మోసం చేసిన సాధిక్‌ను కొత్తచెరువు మండలం నారపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ రమాకాంత్, దిశా డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. నిందితుడు సాధిక్ వద్ద నుంచి బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు సాధిక్‌పై 376 సెక్షన్, 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


ధర్మవరంలో నిందితుడి సాధిక్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన అనంతరం ధర్మవరం డి.ఎస్.పి రమాకాంత్ కేసు వివరాలు వెల్లడించారు. తేజస్విని మృతదేహానికి పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నిందితుడిపై అదనంగా 376 అత్యాచారం సెక్షన్‌ను నమోదు చేశామన్నారు. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి, శారీరకంగా అవసరాలు తీర్చుకుని దారుణంగా మోసం చేసి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని చెప్పారు. నిందితుడు సాధిక్‌ను కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. రెండు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి,  ఛార్జిషీట్ దాఖలు చేస్తామని దిశా డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. మరోవైపు యువతిపై అత్యాచారం జరిగిందా లేదా అనే విషయంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. 


అసలేం జరిగిందంటే..  
గోరంట్ల టౌన్ కి చెందిన యం.గోపి కుమార్తె తేజస్విని, వయస్సు 20  సంవత్సరాలు. తిరుపతిలో బి-ఫార్మసీ, మూడో సంవత్సరం చదువుతోంది. ఈమె గోరంట్ల టౌన్ లోని తన పొరుగింటికి చెందిన సాదిక్ తో 3 సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. తేజస్విని 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుండి గోరంట్ల వచ్చి, సాదిక్ తో కలిసి మల్లేపల్లి గ్రామంలోని సాదిక్ కి చెందిన రూమ్ కి వెళ్ళారు. కొంతసేపటికి సాదిక్ భోజనం తెస్తానని గోరంట్ల టౌన్ కి వచ్చాడు. రాత్రి 10 గంటల వరకు వాళ్ళు ఇంట్లో ఉండగా మృతురాలు చాలాసార్లు సాదిక్ కు ఫోన్ చేసింది. ఈ క్రమంలో చాలాసార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. తర్వాత రాత్రి సుమారు 10 గంటల సమయంలో సాదిక్ తిరిగి వెళ్ళే సమయానికి తేజస్విని ఉరి వేసుకొని చనిపోయి కనిపించింది.


విషయం తెలుసుకున్న గోరంట్ల సీఐ గ్రామస్తుల సహాయంతో తలుపులు పగులగొట్టి మృతురాలిని పోస్టు మార్టం నిమిత్తం పెనుకొండ హాస్పిటల్ కి పంపారు. టీం అఫ్ డాక్టర్స్ పోస్టుమార్టం  నిర్వహించి ఉరి వేసుకోవడం వల్ల మరణించిందని, ఎటువంటి రేప్ జరగలేదని తెలిపారు.  5 వ తేదీ సాయంత్రం మృతురాలి బందువులు గ్యాంగ్ రేప్ జరిగిందని అనుమానం వ్యక్తం చేయడంతో ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో రీ పోస్టుమార్టం కోసం పెనుకొండ హాస్పిటల్ కి పంపించారని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ పేర్కొన్నారు.


విద్యార్థిని తల్లిదండ్రులు ఏమన్నారంటే..
ప్రేమ పేరుతో నమ్మించి తమ బిడ్డ తేజస్వినిని సాధిక్  హత్య చేశాడని ఆరోపించారు. మాయమాటలతో తిరుపతి కాలేజీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన సొంత వ్యవసాయ పొలంలోని షెడ్డుకు పిలిపించి.. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతురు మరణంపై ఫిర్యాదు చేయగా గోరంట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. తేజస్విని గోరంట్ల పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు సైతం దిగారు. హత్యకు కారకులను శిక్షించి, కఠిన చర్యలు తీసుకోవాలని తేజస్విని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


Also Read: B Pharm Student Death: ప్రియుడి తోటలో ప్రియురాలు మృతి, హత్యా? ఆత్మహత్యా?


Also Read: Chittoor: ఎదురింటికి వెళ్లొద్దన్న పక్కింటాయన, టెకీని సుత్తితో చావగొట్టిన ఫ్యామిలీ!