బీ ఫార్మసీ విద్యార్థిని ఓ తోటలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడం కలకలం రేపుతోంది. తోటలోని ఓ షెడ్డులో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె కనిపించింది. ప్రేమించిన వ్యక్తే నమ్మించి తమ కూతురిని హత్య చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రియుడిపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాలివీ..


శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని మల్లాపల్లి పొలంలో తన ప్రియుడికి సంబంధించిన షెడ్డులో బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆమె మరణవార్త తెరపైకి వచ్చింది. యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పేరుతో నమ్మించి తమ బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. మాయమాటలతో తిరుపతి కాలేజీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన సొంత పొలంలోని షెడ్డుకు పిలిపించి హత్య చేసి, ఆత్మహత్యగా నమ్మిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగల కొట్టి మృతదేహాన్ని బయటికి తీశారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు. తర్వాత గోరంట్ల పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరంట్ల టౌన్ కి చెందిన యం.గోపి కుమార్తె తేజస్విని, వయస్సు 20  సంవత్సరాలు. తిరుపతిలో బి-ఫార్మసీ, మూడో సంవత్సరం చదువుతోంది. ఈమె గోరంట్ల టౌన్ లోని తన పొరుగింటికి చెందిన సాదిక్ తో 3 సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. తేజస్విని 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుండి గోరంట్ల వచ్చి, సాదిక్ తో కలిసి మల్లేపల్లి గ్రామంలోని సాదిక్ కి చెందిన రూమ్ కి వెళ్ళారు. కొంతసేపటికి సాదిక్ భోజనం తెస్తానని గోరంట్ల టౌన్ కి వచ్చాడు. రాత్రి 10 గంటల వరకు వాళ్ళు ఇంట్లో ఉండగా మృతురాలు చాలాసార్లు సాదిక్ కు ఫోన్ చేసింది. ఈ క్రమంలో చాలాసార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. తర్వాత రాత్రి సుమారు 10 గంటల సమయంలో సాదిక్ తిరిగి వెళ్ళే సమయానికి తేజస్విని ఉరి వేసుకొని చనిపోయి కనిపించింది.


 విషయం తెలుసుకున్న గోరంట్ల సీఐ గ్రామస్తుల సహాయంతో తలుపులు పగులగొట్టి మృతురాలిని పోస్టు మార్టం నిమిత్తం పెనుకొండ హాస్పిటల్ కి పంపారు. టీం అఫ్ డాక్టర్స్ పోస్టుమార్టం  నిర్వహించి ఉరి వేసుకోవడం వల్ల మరణించిందని, ఎటువంటి రేప్ జరగలేదని తెలిపారు.  5 వ తేదీ సాయంత్రం మృతురాలి బందువులు గ్యాంగ్ రేప్ జరిగిందని అనుమానం వ్యక్తం చేయడంతో ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో రీ పోస్టుమార్టం కోసం పెనుకొండ హాస్పిటల్ కి పంపించారని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ పేర్కొన్నారు.


ఈ క్రమంలో టీడీపీ దీనిపై స్పందించింది. సీఎం జగన్ చేతకాని పాలనలో మహిళలపై ప్రతిరోజు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆరోపించింది. బీ ఫార్మసీ విద్యార్థినిని హత్యాచారం చేసి.. ఆత్మహ‌త్యగా చిత్రీక‌రించ‌డం దారుణమని చంద్రబాబు ధ్వజమెత్తారు. మృత‌దేహాంతో ధ‌ర్నాకి దిగినా కూడా పోలీసులు స్పందించ‌క‌పోవ‌డం దారుణమని మండిపడ్డారు. ఆడ‌బిడ్డని కోల్పోయిన త‌ల్లి న్యాయం చేయాల‌ని పోలీస్‌స్టేష‌న్ ఎదుట వేడుకుంటున్నా.. కనికరించట్లేదని నారా లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవటం వల్లే రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. హత్యాచారం చేసిన నిందితుల్ని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇక అనుమానాలు మరింతగా ఉన్న వేళ బి.ఫార్మసీ విద్యార్థిని మృతదేహానికి నేడు (మే 6) మరోసారి శవపరీక్ష నిర్వహించనున్నారు. ప్రేమికుడే హత్య చేశాడని యువతి తల్లిదండ్రులు, మృతురాలి బంధువుల ఆరోపణలతో మరోసారి పోస్టు మార్టం చేపట్టనున్నారు.